Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Vemulavada Politics: బస్సెక్కిన బల్దియా కౌన్సిలర్లు, వేడెక్కిన వేములవాడ రాజకీయాలు

Vemulavada Politics: బస్సెక్కిన బల్దియా కౌన్సిలర్లు, వేడెక్కిన వేములవాడ రాజకీయాలు

వేములవాడ టూ హైదరాబాద్ వయా కరీంనగర్

రాష్ట్ర వ్యాప్తంగా చాలా పురపాలక సంఘాల్లో అవిశ్వాస తీర్మానాల జాతర కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రభావం వేములవాడ పురపాలక సంఘంపై పడింది. అయితే అన్ని ప్రాంతాల్లో లాగా ఇక్కడ అవిశ్వాసం కానప్పటికీ అంతకుమించి రాజకీయాలు కొనసాగుతున్నాయి, తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ గత ఏడాది డిసెంబర్ నెలలో తన పదవికి రాజీనామా చేశాడు. దీంతో జనవరి నెలలో రాజీనామాను ఆమోదించిన జిల్లా కలెక్టర్ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో వచ్చే నెల 12వ తేదీన వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో స్థానికంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

- Advertisement -

క్యాంప్ రాజకీయాలు షురూ

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ముందు వేములవాడ పురపాలక సంఘంలో బి.ఆర్.ఎస్ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఉంది. అయితే ఎన్నికల సందర్భంగా కొంతమంది కౌన్సిలర్లు పార్టీలు మారారు. ఈ క్రమంలో ప్రస్తుతం బి.ఆర్.ఎస్ పార్టీకి-20, బీజేపీకి-05, కాంగ్రెస్ కు-03మంది కౌన్సిలర్ల బలం ఉంది.ఈ లెక్కన వైస్ చైర్మన్ ఎన్నికల్లో మళ్ళీ బి.ఆర్.ఎస్ పార్టీకే వైస్ చైర్మన్ పదవి దక్కాలి. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎన్నికల ముందు వరకు బి.ఆర్.ఎస్ పార్టీలో ఉన్న 14వ వార్డ్ కౌన్సిలర్ బింగి మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. చేరడమే తరువాయి వైస్ చైర్మన్ పీఠంపై కన్ను వేశాడు. అనుకున్నదే తడవుగా తన పార్టీలో ముగ్గురే కౌన్సిలర్లు ఉన్నప్పటికీ బీజేపీ కౌన్సిలర్ల మద్దత్తుతో పాటు బి.ఆర్.ఎస్ పార్టీలోని కొంతమందిని లాక్కొని ఎట్లాగైన వైస్ చైర్మన్ కావాలని ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమందిని తనకు అనుకూలంగా మార్చుకొని, పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

క్యాంపు కు తరలిన బి.ఆర్.ఎస్ కౌన్సిలర్లు

ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారు. పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు బింగి మహేష్ తో టచ్ లో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడటంతో వెంటనే క్యాంప్ రాజకీయాలు షురూ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా వైస్ చైర్మన్ రేసులో ఉన్న మారం కుమార్ ఆధ్వర్యంలో 19మంది కౌన్సిలర్లలో నుండి మంగళవారం రాత్రి 16మంది వేములవాడ టూ హైదరాబాద్ వయా కరీంనగర్ మీదుగా బయలుదేరినట్లు, మరో ముగ్గురు కౌన్సిలర్లు దారిలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కరీంనగర్ లో ఉన్న వీరు అటు హైదరాబాద్ వెళ్తారా…? ఇటు తిరిగి వేములవాడకే వస్తారా…?లేదంటే కరీంనగర్ లొనే ఉంటారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

పీఠంపై కాంగ్రెస్ కన్ను…పలువురు మద్దత్తు

మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంతో పాటు స్థానికంగా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండటంతో వైస్ చైర్మన్ పీఠాన్ని ఎట్లాగైన కైవసం చేసుకోవాలని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వైస్ చైర్మన్ అభ్యర్థి బింగి మహేష్ లు ఆలోచనలో ఉన్నట్లు, దీనికి అనుగుణంగానే బీజేపీ కౌన్సిలర్లతో పాటు మారం కుమార్ ను వ్యతిరేకించే కొంతమంది బి.ఆర్.ఎస్ కౌన్సిలర్ల మద్దతు కూడగడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లు బీజేపీలోని 5మందిలో నలుగురు కౌన్సిలర్లు, బి.ఆర్.ఎస్ పార్టీలోని 6మంది కౌన్సిలర్లు మహేష్ కు మద్దత్తు తెలపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వైస్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ వశం కావడం ఖాయమనిపిస్తుంది.

క్రాస్ ఓటింగ్ పై గులాబీ నేతల్లో టెన్షన్

ఇదిలా ఉండగా సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ బి.ఆర్.ఎస్ నేతల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన 6మంది కౌన్సిలర్లలో కొంతమంది బింగి మహేష్ కు బంధువులు అవ్వడం, మరికొంత మంది మారం కుమార్ వైఖరిని వ్యతిరేకించడం, ఇంకొంత మంది వైస్ చైర్మన్ అభ్యర్థిని మార్చాలని కోరడం వంటి పరిణామాలు బి.ఆర్.ఎస్ నేతల టెన్షన్ ను రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా కౌన్సిలరలందరిని ఒక్క తాటిపై తీసుకువచ్చి, మళ్ళీ మున్సిపాలిటీ పై గులాబీ జెండానే ఎగరవేసి, మిగిలి ఉన్న ఒక్క ఏడాదైన సాఫీగా పాలన సాగించాలనే ఉద్దేశ్యంతో ముందస్తుగానే అందరిని క్యాంప్ కు తరలించి, అక్కడే అంతా సెట్ చేసే పనిలో పడ్డారు.

ఫిబ్రవరి 12న వీడనున్న సస్పెన్స్

ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో వైస్ చైర్మన్ ఎవరనేది తేలేది మాత్రం వచ్చే నెల 12వ తేదీనే. అంతలోపు ఎవరు ఎటు వెళ్తారు…?ఎవరికి ఎవరు మద్దతు ఇస్తారు….?వైస్ చైర్మన్ పీఠం ఎవరినీ వరించబోతుంది…? ఇలా చాలా రకాల ప్రశ్నలు ప్రజల మధ్యలో చర్చకు దారితీయనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News