Vijay fans issue sensational warning to the Governor: తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది. తమిళ స్టార్ హీరో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో ఆగిపోయింది. దీంతో, తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అధికారం దూరమవుతుందనే టెన్షన్ ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్‌కు, విజయ్ ఫ్యాన్స్‌కు పట్టుకుంది. అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ.. విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రాజకీయ పార్టీలు, మరోవైపు విజయ్ అభిమానులు గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. గురువారం మధ్యాహ్నం విజయ్ నివాసం వద్ద ఒక ఆసక్తికరమైన, భావోద్వేగపూరిత దృశ్యం కనిపించింది. విజయ్‌ను సీఎం కాకుండా కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఒక అభిమాని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ప్రజలు మార్పును కోరుకుని విజయ్‌కు మద్దతు ఇచ్చారని, కానీ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సదరు అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/money-bags-thrown-during-ed-raids/
జల్లికట్టు తరహా ఉద్యమం చేస్తామంటూ హెచ్చరిక..
గవర్నర్ తన తీరు మార్చుకోకపోతే తమిళనాడు మరోసారి ఉగ్రరూపం దాల్చుతుందని విజయ్ అభిమాన సంఘాలు హెచ్చరించాయి. గతంలో జరిగిన ‘జల్లికట్టు’ ఉద్యమం తరహాలో రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్లపైకి వస్తుందని, అప్పుడు పరిస్థితి అదుపు తప్పుతుందని వారు స్పష్టం చేశారు. అటు సోషల్ మీడియాలో కూడా విజయ్‌కు మద్దతుగా వందలాది పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి విజయ్‌కు ఇంకా క్లియరెన్స్ రాలేదు. సొంతంగా మెజారిటీ లేని పక్షంలో, మద్దతు ఇస్తున్న పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 118 మంది సభ్యుల జాబితాను సమర్పించాలని గవర్నర్ పట్టుబడుతున్నట్లు సమాచారం. బలం నిరూపించుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తామని గవర్నర్ స్పష్టం చేయడంతో టీవీకే వర్గాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సస్పెన్స్ నెలకొంది.

