అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. తెలంగాణ ప్రజలు అధికార, ప్రతిపక్షాలు ఎవరో తేల్చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కూడా రెడీ అయిపోయింది. రేపో ఎల్లుండో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ను ఎంపిక చేసుకుంటారు కూడా. కానీ రెట్టించిన విజయోత్సాహంతో కొలువు తీరాల్సిన కాంగ్రెస్ సర్కారు మాత్రం ఇంకెప్పుడు అధికార పగ్గాలు చేపడుతుందో అర్థంకాని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
సోమవారం సాయంత్రం రాజ్ భవన్ లో జరగాల్సిన ప్రమాణస్వీకారం అర్ధాంతరంగా ఆగిపోయింది. అసలు సీఎం ఎవ్వరన్న విషయంపై ఎడతెగని ప్రతిష్ఠంభన నెలకొనడం షరామామూలుగా కాంగ్రెస్ కల్చర్ అయినప్పటికీ గెలిచిన రాష్ట్రంలో సైతం ఉత్సాహంగా సర్కారు ఏర్పాటు చేసే విషయంపై హైకమాండ్ కనీసం దృష్టిపెట్టకపోవటం విచిత్రమైన రాజకీయ పరిస్థితిగా కనిపిస్తోంది.
ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ సోమవారం పగలంతా ఓటమికి కారణాలపై పోస్టుమార్టం నిర్వహించటంపైనే ఫోకస్ పెట్టిందని సీనియర్ నేత జైరామ్ రమేష్ చెప్పేదాక తెలంగాణ సీఎం ఎవ్వరన్న విషయంపై హస్తం పెద్దలు దృష్టి సారించలేదని తెలియకపోవటం మరో హైలైట్.
మరి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తారా? డిప్యుటీ సీఎంలు ఎంతమంది ఉంటారు? స్పీకర్ పదవిని ఎవరికి కట్టబెడతారు? కీలక శాఖలు దక్కేదెవరికి? ఎంతమంది మంత్రులుంటారు? క్యాబినెట్ కూర్పులో ఏ ఏ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారు? ఏ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత కాంగ్రెస్ సర్కారులో దక్కనుంది? గెలిచిన సీనియర్లందరినీ సంతృప్తిపరచి, అసమ్మతి లేకుండా-తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకునే చర్యలేంటి? కనీసం మంగళవారమైనా సీఎం, కేబినెట్ పై అధిష్ఠానం స్పష్టత ఇస్తుందా అన్న ప్రశ్నలెన్నో ఇటు కాంగ్రెస్ నేతలు అటు సామాన్యుల్లో ఉన్నాయి. ఈనేపథ్యంలో సీల్డ్ కవర్ సీఎం ఎవరనేదానిపై సందిగ్ధత నెలకొంది.
మొత్తానికి ఇంకా కొలువు తీరకముందే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు మొదలైపోయాయన్నమాట.