Meera Sanghamitra on environment protection: పర్యావరణం కోసం తెలుగు ప్రభ యాజమాన్యం చాలా గొప్ప సంచికను వెలువరించిందని జాతీయ పర్యావరణ న్యాయ వేదిక సభ్యురాలు మీరా సంఘమిత్ర అభినందించారు. మ్యాగజిన్ కవర్ పేజీ చూస్తే ముచ్చటేసిందన్నారు. చెంచులు, ఆదివాసిలు, మత్స్యకారులు, రైతులు ఇలా ప్రకృతితో కలిసి జీవించే వారి చిత్రాలు ఎంతో ఆకట్టుంటున్నాయని, పర్యావరణం అంటే కేవలం జంతువుల, చెట్లు, మొక్కలే కాదు.. రైతులు, చెంచులు, గిరిజనులు, ఆదివాసులతో పాటు సకల జీవచరాల సమూహమని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన “తెలుగుప్రభ పర్యావరణ ప్రత్యేక సంచిక- 2026” అవిష్కరణ సభలో ఆమె మాట్లాడుతూ.. “ప్రభుత్వాలు ఎకో టూరిజం, మైనింగ్ పేరుతో అడవుల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇది సరైన విధానం కాదు. దీన్ని అందరం సమిష్టిగా వ్యతిరేకించాల్సి అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణ ఉద్యమం దేశవ్యాప్తంగా పలు రూపాల్లో జరుగుతోంది. లఢక్‌లో హిమాలయాలను కాపాడటం, ఛత్తీస్‌గడ్‌లో హర్ధేవ్ భచావ్ ఆందోళనలు, తెలంగాణలో కంచె గచ్చిబౌలీ భూముల పరిరక్షణ ఇలా ప్రతి చోటా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణకై వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే, ఈ పోరాటాలకు ఎక్కువ మంది సమూహం తోడైనప్పుడే ప్రభుత్వాలు పర్యావరణ వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకుంటాయి.
Also read: Kanneganti Ravi: సమిష్టిగా పనిచేస్తేనే పర్యావరణాన్ని కాపాడుకోగలం.. కన్నెగంటి రవి
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఎన్‌జీటీ ఇండస్ట్రీల వైపు..
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ”స్టాక్ హోం కన్వెన్షన్-1972 ప్రకారం, రాజ్యాంగంలో 48(ఎ), 51 (జీ) ఆర్టికల్స్ ప్రకారం పర్యావరణ పరిరక్షణ పౌరుల బాధ్యత కూడా. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చింది. పోరాటాల వల్లే ఈ చట్టాలు వచ్చాయని అందరూ గమనించాలి. 2010 నేచనల్ గ్రీన్ డ్రెబ్యునల్ చట్టం వచ్చింది. ఆ తర్వాత గత పదిహేనేళ్లుగా పెట్టుబడిదారి విధానంలోనే పాలన సాగుతోంది. అటు ప్రభుత్వాలే కాకుండా న్యాయస్థానాలు కూడా పెట్టుబడిదారి విధానాలకు మద్ధతు తెలపడం శోచనీయం. గతంలో పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సుప్రీం కోర్టు చెప్పేది. కానీ, ఇప్పుడు అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసాన్ని ఎంతమాత్రం అడ్డుకోవడం లేదు. ఇది అత్యంత ప్రమాదాన్ని సూచిస్తోంది. ఆదివాసీ, గిరిజనులు, ప్రకృతి ప్రేమికుల ఎన్నో పోరాటాల ఫలితంగా అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చిందని పౌరులు గుర్తించుకోవాలి. ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రెబ్యునల్ (ఎన్‌జీటీ) ఆర్డర్లపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వారు పరిశీలన చేయగా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. లక్ష ఆర్డర్లను పరిశీలించగా వాటిలో 80 శాతం పర్యావరణానికి వ్యతిరేకంగా, పరిశ్రమలకు అనుకూలంగా తీర్పులు ఇవ్వడం చాలా దారుణం. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఎన్‌జీటీ ఇండస్ట్రీల వైపు నిలబడటం ఆందోళకరమైన అంశంగా పరిగణించాలి.” అని అన్నారు.
అదానీ, అంబానీ అభివృద్ధి పేరుతో అడవులను దోచుకుంటున్నారు..
”అదానీ, అంబానీ అభివృద్ధి పేరుతో అడవులను మొత్తం దోచుకుంటున్నారు. వారే జియో ఇంజినీరింగ్ వంటి కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. వీటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమేంటో మేధావులు ప్రజలకు వివరించాలి. ప్రభుత్వాలు వేలాది ఎకరాలను ప్రజల నుంచి సేకరించి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నాయి. మేము జాతీయ పర్యావరణ న్యాయ వేదిక ద్వారా ఎన్నో ప్రజా ఉద్యమాల చేపట్టాం. గత మూడేళ్లుగా సామాజిక న్యాయం, పర్యావరణ దృక్పంథంపై పనిచేస్తున్నాం. ఫార్మా పొల్యూషన్‌ను అరికట్టకుండా మూసీ బ్యూటిఫికేన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం విధ్వంసం చేస్తోంది. డేటా సెంటర్ల ఏర్పాటు, మూసీ ప్రక్షాలన, ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటు వంటివి వ్యతిరేకించాలి. ఎక్కువ మంది యువతను పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం చేయాలి. మాపై అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పర్యావరణం కోసం పోరాడుతున్నాం. పౌర సమాజం, మీడియా కూడా తమ వంతుగా పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలి. ఈ విషయంలో తోడ్పాటునందిస్తున్న తెలుగు ప్రభ యాజమాన్యానికి అభినందనలు.” అని పేర్కొన్నారు.

