BAN vs IND : రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో విజయం సాధించిన టీమ్ఇండియా అదే ఊపులో రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని బావిస్తోంది. మీర్‌పూర్ వేదికగా రేపటి(గురువారం) నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈమ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధిస్తే ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగుకానున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. చతేశ్వర పుజరా, అశ్విన్, అక్షర్ పటేల్, సిరాజ్ లు అరుదైన మైలురాళ్లను అందుకునేందుకు సిద్దమయ్యారు. రెండో టెస్టులో పుజారా 16 పరుగులు చేస్తే టెస్ట్ క్రికెట్‌లో 8 వేల పరుగుల మైలు రాయిని అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలవనున్నాడు. సచిన్, రాహుల్ ద్రవిడ్, గవాస్కర్, లక్ష్మణ్, సెహ్వాగ్, కోహ్లీ, గంగూలీ లు మాత్రమే ఇప్పటి వరకు ఈ మర్క్‌ను దాటారు.
అశ్విన్ మరో 11 పరుగులు చేస్తే 3వేల పరుగుల మార్క్‌ను అందుకున్న బ్యాటర్‌గా నిలవనున్నాడు. టెస్టు క్రికెట్‌లో 400 పైగా వికెట్లు తీయడంతో పాటు మూడు వేల పరుగులను చేసిన కపిల్ దేవ్, షేర్ వార్న్, షాన్ పొలాక్‌ల సరసన చేరతాడు. మరో ఏడు వికెట్లు పడగొడితే అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా, అంతర్జాయంగా రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
అక్షర్ పటేల్ 6 వికెట్లు తీస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత బౌలర్‌గా నిలవనున్నాడు. ఈ రికార్డు ప్రస్తుతం అశ్విన్ పేరు మీద ఉంది. అశ్విన్ ఈ ఘనతను 9 టెస్టుల్లో అందుకోగా, అక్షర్ 8వ టెస్టులోనే ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వచ్చింది.
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఒక్క వికెట్ తీస్తే బుమ్రా పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తాడు. ఈ సంవత్సరం అన్ని ఫార్మాట్లలో కలిపి బుమ్రా, సిరాజ్‌లు చెరో 39 వికెట్లు పడగొట్టి భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లుగా కొనసాగుతున్నారు. సిరాజ్ ఒక్క వికెట్ తీసినా బుమ్రాను వెనక్కి నెట్టనున్నాడు.