ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final) ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బౌలర్లు విజృంభించారు. దీంతో టెస్టు క్రికెట్ లో సరికొత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియన్ ఓపెనర్ ఖవాజా, సౌతాఫ్రికా ఓపెనర్ మార్క్రామ్ ఇద్దరూ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యారు. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇరు జట్ల ఓపెనర్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఓవరాల్ గా 10 సార్లు మాత్రమే ఇలా జరిగింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆసీస్ బౌలర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా రబాడ అయితే నిప్పులు చెరిగే బంతులతో హడలెత్తించాడు. ప్రొటీస్ బౌలర్ల దెబ్బకు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0), కామెరాన్ గ్రీన్ (4), లబుషేన్ (17) తక్కువ స్కోర్లకే ఔట్.. సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 66 పరుగులతో రాణించాడు. ఇక వెబ్స్టర్ 72 పరుగులతో ఆదుకున్నాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోర్ అయిన చేయగలిగింది. ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని రబాడ శాసించగా.. జాన్సన్ మూడు వికెట్లు, మార్క్రామ్, మహరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇక అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లకు కూడా ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ వేసే బంతులు ఎదుర్కోలేక కంగారుపడ్డారు. ఈ క్రమంలోనే మార్క్రామ్ (0), రికెల్టన్ (16) తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో ఒక్క పరుగు చేయడానికి సౌతాఫ్రికా బ్యాటర్లు అల్లాడిపోయారు. చివరగా ముల్డర్ (6), ట్రిస్టన్ స్టబ్స్ (2)ను ఔట్ అయ్యారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 22 ఓవర్లలో 43/4 పరుగులతో నిలిచింది. కెప్టెన్ టెంబా బవుమా (3), బెడింగ్హామ్ (8) పరుగులతో క్రీజులో ఉండగా.. ఇంకా 169 పరుగులతో వెనుకబడి ఉంది.
ఇదిలా ఉంటే ఐదు వికెట్లతో రాణించిన రబాడ సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. 71 టెస్టుల్లో 332 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డ్ అలెన్ డొనాల్డ్ పేరు మీద ఉండేది. డొనాల్డ్ 72 టెస్టుల్లో 330 వికెట్లు తీశాడ. ఇదే కాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్ గానూ నిలిచాడు. అంతకుముందు కివీస్ ఆటగాడు జేమిసన్ 2021లో టీమిండియాపై ఐదు వికెట్లు తీశాడు.