Match Fixing in Cricket: అమెరికా క్రికెట్ స్టార్ ఆరోన్ జోన్స్‌పై ఐసీసీ (ICC) వేటు వేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో అతనిపై తాత్కాలిక నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
2024 టీ20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టు సూపర్-8 దశకు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాటర్ ఆరోన్ జోన్స్ (Aaron Jones) తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాడు. మ్యాచ్ ఫిక్సింగ్ మరియు అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అతనిపై తక్షణమే అమల్లోకి వచ్చేలా తాత్కాలిక నిషేధం విధించింది.
అసలు ఏం జరిగింది?
బార్బడోస్‌లో జరిగిన BIM10 లీగ్ (2023-24 సీజన్) సమయంలో ఆరోన్ జోన్స్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ వెస్టిండీస్ (CWI) మరియు ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌లోని ఐదు నిబంధనలను జోన్స్ ఉల్లంఘించినట్లు ఐసీసీ గుర్తించింది.
ఆరోపణలు ఇవే:
**BIM10 టోర్నమెంట్‌లో మ్యాచ్ ఫలితాలను లేదా మ్యాచ్‌లోని కొన్ని అంశాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం.
**బుకీలు తనను సంప్రదించినప్పుడు ఆ విషయాన్ని అధికారులకు రిపోర్ట్ చేయకపోవడం.
**ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ACU) జరిపిన విచారణలో సహకరించకుండా సాక్ష్యాలను దాచడం లేదా తారుమారు చేయడం.
Also Read: Shivam Dube -వైజాగ్ టీ20లో దూబే విధ్వంసం.. హార్దిక్ రికార్డు బద్దలు!
ఐసీసీ అధికారిక ప్రకటన
“ఆరోన్ జోన్స్‌ను తక్షణమే అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుండి సస్పెండ్ చేస్తున్నాము. ఈ ఆరోపణలపై స్పందించడానికి అతనికి జనవరి 28, 2026 నుండి 14 రోజుల సమయం ఇచ్చాము” అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం BIM10 లీగ్ మాత్రమే కాకుండా, రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించి కూడా అతనిపై ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.
కెరీర్ ప్రమాదంలో..
31 ఏళ్ల ఆరోన్ జోన్స్ అమెరికా తరపున ఇప్పటివరకు 52 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. ముఖ్యంగా 2024 వరల్డ్ కప్‌లో కెనడాపై అతను ఆడిన ఇన్నింగ్స్ అతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది. అయితే, తాజా ఫిక్సింగ్ ఆరోపణలు నిరూపితమైతే అతని అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

