Abhishek Sharma creates history: టీమ్ ఇండియా యంగ్ సంచలనం అభిషేక్ శర్మ బ్యాటింగ్ కు రికార్డులన్నీ దాసోహమంటున్నాయి. కింగ్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కు కూడా సాధ్యం కానీ ఓ అరుదైన ఘనతను సాధించాడు ఈ చిచ్చర పిడుగు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇప్పటికే అభిషేక్ టాప్ ర్యాంకులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాయింట్లలో మాత్రం మనోడు ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఏ ఇతర బ్యాటర్ కూడా ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించలేదు.
ఇప్పటి వరకు అత్యధిక రేటింగ్ పాయింట్లతో డేవిడ్ మలన్ ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. ఈ ఇంగ్లాండ్ బ్యాటర్ సాధించిన 919 రేటింగ్ పాయింట్లే ఇప్పటి వరకు అత్యధికం. అయితే ఆసియా కప్ లో అభిషేక్ పరుగుల వరద పారించడం ద్వారా మలన్ రికార్డును బద్దలుకొట్టడమే కాకుండా ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నాడు. అభిషేక్ ఇప్పుడు 931 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో 900 రేటింగ్ పాయింట్ల చేరుకున్న ఆరో బ్యాటర్ మాత్రమే కాదు 931 పాయింట్లకు చేరుకున్న తొలి వ్యక్తి కూడా అభిషేక్. గతంలో టీమిండియా తరపున సూర్యకుమార్ యాదవ్ 912 పాయింట్లను, విరాట్ కోహ్లీ 909 రేటింగ్ పాయింట్లను చేరుకున్నారు. తాజాగా వీరిద్దరినీ అభిషేక్ అధిగమించాడు.
Also Read: Indian Cricket Team -ఆసియా కప్ ముగిసింది.. టీమిండియా తర్వాత ఆడబోయే సిరీస్ లు ఇవే..!
టాప్-3కు తిలక్..కిందకు సూర్య..
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ నంబర్ 1 స్థానంలో ఉండగా.. ఆసియా కప్ ను గెలిపించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడు 819 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాడు. వీరిద్దరికీ మధ్య 844 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్ లో దిగజారాడు. అతడు ఆరో ర్యాంక్ నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. ఇతడు 698 రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్నాడు.


