ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తనదైన స్టైల్లో తిరిగి దూసుకొచ్చింది. హోమ్ గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్)లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం నమోదు చేసింది. రికార్డు స్థాయి ఛేజింగ్‌తో అభిమానులకు మర్చిపోలేని రాత్రిని అందించింది. 245 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి, ఇంకో 9 బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 పరుగులు బాదాడు. ఇందులో 14 బౌండరీలు, 10 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 40 బంతుల్లోనే సెంచరీని అందుకున్న అభిషేక్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి శతకం నమోదు చేశాడు. సెంచరీ అనంతరం “This one’s for Orange Army” అని రాసి ఉన్న ఓ పేపర్‌ను చూపించి ప్రేక్షకుల్ని ఉత్సాహాన్ని అందించాడు.
అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్, బ్యాటింగ్ ఎంచుకుని 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు.
ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (36) అదే జోరును కొనసాగించాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (42)తో అదరగొట్టాడు. అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (82) చెలరేగాడు. చివర్లో స్టాయినిస్ (34) హైదరాబాద్ బౌలర్లకు చుక్కులు చూయించాడు. నేహల్ వధేరా (27), శశాంక్ సింగ్ (2), మ్యాక్స్‌వెల్ (3) రన్స్ సాధించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీశాడు. ఇషాన్ మలింగ 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
అయితే భారీ స్కోర్ పంజాబ్ బౌలర్లు అభిషేక్ శర్మ వీరబాటుకు సమాధానం చెప్పలేకపోయారు. ఏ బౌలర్ వేసినా, ఎక్కడ వేసినా… బంతి బౌండరీ దాటించాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఇది హైదరాబాద్‌కు రెండో విజయం. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచిన హైదరాబాద్, అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాన్ని చవిచూసింది. అయితే పంజాబ్‌పై ఈ విజయం తో జట్టు పుంజుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి ఎస్ఆర్‌హెచ్ చేరింది. ఈ గెలుపుతో హైదరాబాద్ ఆటగాళ్లలో తిరిగి జోష్ వచ్చింది.