డిసెంబర్ 15 వ తేదీ నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 వ తేదీ వరకు ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం భవనంలో కలెక్టర్ ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణ పై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను నిర్వహిస్తోందన్నారు.
గ్రామ, వార్డు స్థాయి, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో క్రికెట్ , వాలీబాల్ , బ్యాడ్మింటన్ , కబడ్డీ, కోకో అనే 5 క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామని వీటితోపాటు యోగా , టెన్నికాయిట్ , మారథాన్ క్రీడల్లో కూడా పోటీలు ఉంటాయని ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం అయిందని, 15 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు ఈ క్రీడల్లో పాల్గొనవచ్చని ఆసక్తి ఉన్న వారు మీ సమీపంలో ఉన్న గ్రామ, వార్డ్ సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చన్నారు.
https://aadudamandhra.ap.gov.in/login లో గాని, 1902 నంబర్ కి ఫోన్ చేసి కూడా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు గ్రూప్ గా గానీ, ఒక్కొక్కరుగా కానీ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.