Ajinkya Rahane : భారత క్రికెటర్ అజింక్య రహానే మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. రంజీ క్రికెట్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా ద్విశతకం బాదేశాడు. 261 బంతులు ఎదుర్కొని 26 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 204 పరుగులు చేశాడు. రహానేతో పాటు యశస్వి జైస్వాల్ (162), సర్ఫరాజ్ ఖాన్ (126 నాటౌట్)లు రాణించడంతో ముంబై 127 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 651 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ముంబై తరుపున ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ 80 బంతుల్లో 90 రన్స్ చేశాడు.
గత కొంతకాలంగా ఫామ్ లేమీలో రహానే తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు. దీంతో భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. రహానే పాటు సీనియర్ ఆటగాడు పుజారా దాదాపుగా ఒకే సారి జట్టులో చోటు కోల్పోయినప్పటికి కౌంటీల్లో సత్తా చాటిన పుజారా తిరిగి భారత జట్టు తలుపు తట్టాడు. రీ ఎంట్రీలో పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే.. రహానే మాత్రం జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని తిరిగి జట్టులో చోటు దక్కించుకుంటానని ఇటీవల ఓ సందర్భంలో రహానే చెప్పాడు. ఈ క్రమంలో రహానే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రెండు ద్విశతకాలు, ఓ సెంచరీ బాదాడు. తాను ఫామ్‌లో ఉన్నానని జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లకు సంకేతాలు పంపాడు. ప్రస్తుత టోర్నీ మొత్తం మెరుగైన ప్రదర్శన కనబరిస్తే జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
ప్రస్తుతం టీమ్ఇండియా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తరువాత 2023 ఫిబ్రవరి, మార్చిలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు రహానే జట్టులో చోటు దక్కించుకుంటాడని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.