APL-2025: ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-4 నేడు ఘనంగా ప్రారంభం కానుంది. గత సీజన్ల కంటే మరింత ప్రతిష్ఠాత్మకంగా, ఆకర్షణీయంగా ఈ సీజన్ నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో ఈ సీజన్‌కి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ సీజన్‌లో కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్, విశాఖ వారియర్స్, తిరుపతి టైగర్స్, నెల్లూరు నైట్స్, రాజమండ్రి రెబల్స్, గుంటూరు గ్లాడియేటర్స్ మొత్తం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. ప్రతీ జట్టులోనూ యువ ప్రతిభావంతులు, టీమ్ ఇండియా స్టేట్ లెవెల్ క్రికెటర్లతో పాటు, ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాళ్లూ ఉన్నారు. యువ క్రికెటర్లకు ఇది మంచి వేదికగా మారనుంది.
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ వేడుకల్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక నృత్య ప్రదర్శనతో మెరవనుంది. యువ సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల సంగీత ప్రదర్శనతో అలరించబోతున్నాడు. ఆటగాళ్ల పరిచయం, ట్రోఫీ ఆవిష్కరణ, కలర్ ఫుల్ డాన్స్ షోలు, తారల సందడి, మొదలైన కార్యక్రమాలతో తొలి రోజు వేడుకలు వైభవంగా జరగనున్నాయి.
ప్రారంభ వేడుకల అనంతరం కాకినాడ కింగ్స్ మరియు అమరావతి రాయల్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. గత సీజన్లలో ఈ రెండు జట్లు మంచి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ ఆసక్తికరంగా ఉండబోతుందని అంచనా. ఈరోజు నుండి సీజన్ ముగిసేవరకు క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం ఉంటుంది.


