Andre Russell Final Match: వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. కండల వీరుడిగా ప్రసిద్ధి చెందిన రసెల్, తన భారీ సిక్సర్లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాడు. బ్యాట్‌తోనే కాకుండా, బంతితోనూ, అద్భుతమైన ఫీల్డింగ్‌తోనూ జట్టుకు ఎన్నోసార్లు కీలక విజయాలను అందించాడు. తనదైన శైలిలో ఆకాశమే హద్దుగా చెలరేగి, బౌండరీల వర్షం కురిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. సొంత మైదానం సబీనా పార్క్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు సహచరులు గౌరవ వందనం సమర్పిస్తుండగా బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్, విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కట్టిపడేశాడు.
మెరుపులు మెరిపించినా.. ఫలితం దక్కలేదు:
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ రసెల్ కెరీర్‌లో చివరిది.ఈ చారిత్రక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్, విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఒక దశలో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడానికి రసెల్ (Dre Russ) ఏడో స్థానంలో క్రీజ్‌లోకి అడుగుపెట్టాడు. వచ్చింది వీడ్కోలు మ్యాచ్ అయినా, అతని ఆటలో పదును తగ్గలేదు. కేవలం 15 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 36 పరుగులు చేసి తన మార్క్ హిట్టింగ్‌తో అలరించాడు. ముఖ్యంగా, బెన్ ద్వార్షుయిస్ వేసిన ఓవర్లో మూడు సిక్సర్లు బాది పాత రసెల్‌ను గుర్తుచేశాడు.అతని మెరుపు ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగుల గౌరవప్రదమైన స్కోరును నమోదు చేయగలిగింది.
ALSO READ: https://teluguprabha.net/sports-news/ind-w-vs-eng-w-odi-series-win/
అయితే, రసెల్ పోరాటం బూడిదలో పోసిన పన్నీరైంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, విండీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్లు త్వరగా వెనుదిరిగినప్పటికీ, జోష్ ఇంగ్లిస్ (33 బంతుల్లో 78 నాటౌట్) కామెరాన్ గ్రీన్ (32 బంతుల్లో 56 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. మూడో వికెట్‌కు క్రీజులోకి వచ్చిన ఈ జోడీ, పరుగుల సునామీ సృష్టిస్తూ బౌలర్లకు చుక్కలు చూపించింది. వారి మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆసీస్ భారీ స్కోరు సాధించగలిగింది. వీరిద్దరూ రికార్డు స్థాయిలో 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాకు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ALSO READ: https://teluguprabha.net/sports-news/ind-vs-eng-4th-test-manchester-do-or-die-preview/
143వ అంతర్జాతీయ మ్యాచ్:
రెండు టీ20 ప్రపంచకప్‌ల విజేత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఆండ్రీ రసెల్, తన 37వ ఏట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇది అతనికి 143వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, “గెలుపుతో వీడ్కోలు పలకాలనుకున్నా అది జరగలేదు. కానీ అభిమానుల ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను,” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.


