Andrew Flintoff : ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ప్రమాదం బారిన పడ్డాడు. బీబీసీలో ప్రసారం అయ్యే ‘టాప్ గేర్’ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా ఫ్లింటాఫ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఫ్లింటాఫ్ గాయపడ్డాడు. వెంటనే అతడిని ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ప్రాంతంలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఫ్లింటాఫ్ ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లింటాఫ్ సాధారణ వేగంతోనే ప్రయాణిస్తున్నాడని, అతి వేగంతో జరిగిన ప్రమాదం కాదని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంగ్లాండ్ జట్టు తరుపున ఆండ్రూ ఫ్లింటాఫ్ 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 3,845, వన్డేల్లో 3,394, టీ20ల్లో 76 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 400 పైగా వికెట్లు తీశాడు.
ఇక టీమ్ఇండియా అభిమానులకు కూడా ఫ్లింటాఫ్ సుపరిచితుడే. లార్డ్ వేదికగా జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్‌లో ఫైనల్లో గంగూలీ, యువరాజ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ మ్యాచ్‌లో గెలవడంతో గంగూలీ చొక్కా విప్పి గింగిరాలు కొట్టిన ఘటనను అభిమానులు అంత త్వరగా ఎవ్వరూ మరిచిపోలేరు.