మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్ -19 మహిళల టీ20(U-19 T20 World Cup) ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచులో మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష(Gongadi Trisha) 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడమే కాకుండా… బ్యాటింగ్‌లోనూ 33 బంతుల్లోనే 44 పరుగులు చేసి అదరగొట్టింది. దీంతో భారత్ వరుసగా రెండో సారి అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.
ఈ నేపథ్యంలో భారత మహిళల జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ‘వరుసగా రెండోసారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు. విశ్వవిజేతగా నిలిచినందుకు జట్టు సభ్యులకు బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాం. జట్టు, సహాయక సిబ్బందికి, హెడ్ కోచ్‌కు కలిపి రూ.5కోట్ల నగదు పురస్కారాన్ని అందజేస్తాం’ అని బీసీసీఐ తెలిపింది.