Team India| సౌతాప్రికా జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ ఖాతాలో మరో రికార్డు చేరింది. విదేశీ గడ్డపై 100 టీ20 విజయాలు సాధించిన రెండవ జట్టుగా చరిత్ర సృష్టించింది. విదేశాల్లో మొత్తం 152 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్.. అందులో 100 విజయాలు సాధించింది. 43 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.
ఇక ఈ జాబితాలో దాయాది దేశమైన పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం. విదేశీ గడ్డపై పాక్ జట్టు 116 విజయాలు సాధించింది. ఇక 84 విజయాలతో ఆఫ్ఘనిస్థాన్ మూడవ స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా జట్టు విదేశాల్లో 71 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ జట్టు విదేశాల్లో 67 మ్యాచుల్లో విజయం సాధించి ఐదవ స్థానంలో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం రాత్రి జరిగిన మూడో టీ20లో సూర్య సేన ఘనవిజయం సాధించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీ చేయడంతో టీమిండియా 219 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నవంబర్ 15న జొహన్నెస్‌బర్గ్ వేదికగా నాలుగవ టీ20 మ్యాచ్ జరగనుంది.