దేశంలోనే ఇ-స్పోర్ట్స్‌కు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదిగేందుకు కేంద్రం సాయం చేయాలంటూ రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇ-స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి సహాయాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో స్థిరమైన ఇ – స్పోర్ట్స్ వ్యవస్థను నెలకొల్పడానికి రాబోయే నాలుగు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుండి ₹255 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని మంత్రి కోరారు. తద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఇ-స్పోర్ట్స్‌కు కేంద్రంగా చేయాలనే లక్ష్యంగా పని చేయడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు.
లిస్టులో ఇ-స్పోర్ట్స్
క్రీడల జాబితాలో ఇ-స్పోర్ట్స్ చేర్చబడిందని, ఇ స్పోర్ట్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో క్రీడాంధ్రప్రదేశ్ సాకారం దిశగా అడుగులు వేస్తున్నామని, ఇప్పటికే అత్యుత్తమ నూతన క్రీడా పాలసీ, క్రీడా యాప్ ఆవిష్కరణ వంటి అంశాలు కూటమి ప్రభుత్వం హయంలో జరిగాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా సెంటర్, జిల్లా స్థాయిలో ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు.

శుక్రవారం రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యవజన, క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్రమంత్రి మాండవీయను కలిశారు. రాష్ట్రంలో క్రీడా సముదాయం ఏర్పాటు ద్వారా, “మల్టీపర్పస్ హాల్, అథ్లెటిక్స్ ట్రాక్, ఫుట్‌బాల్ ఫీల్డ్, స్విమ్మింగ్ పూల్” వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని. ఈ మౌలిక సదుపాయాలు కేవలం క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా, యువత అభివృద్ధి సమాజంతో అనుసంధానం చేస్తూ అవకాశాలను అందిస్తాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పట్టణాలు/నగరాలలో ప్రాథమిక క్రీడా మౌలిక సదుపాయాలు లేవని, ఈ నేపథ్యంలో మంత్రి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొన్ని ప్రతిపాదనలు సమర్పించారు.
రాయచోటి పై ప్రత్యేక దృష్టి
రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుండి 42.62 కోట్ల రూపాయల ప్రాజెక్టు సహకారం అందించాలని, రాయచోటిలో రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా హాకీ కేంద్రాన్ని ఏర్పాటుకు చేసి రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రిని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా కోరారు.