Andhra Pradesh Premier League: APL 2025 నాలుగవ సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. విశాఖపట్నంలోని ACA‑VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో APL సీజన్‑4 ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఎంపీలు భరత్, కేశినేని శివనాథ్, భారత మాజీ మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్ పాల్గొన్నారు. ఈ సీజన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు విక్టరీ వెంకటేష్ ట్రోఫీని ఆవిష్కరించారు.
APL 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రగ్యా జైస్వాల్ నాట్య ప్రదర్శన, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల సంగీత ప్రదర్శన, డ్రోన్ లైట్ షో ద్వారా మైదానంలో విసువల్ ఎఫెక్ట్స్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 లో 21 లీగ్ స్టేజీ, 4 ప్లేఅఫ్ మ్యాచ్‌లు మొత్తం 25 మ్యాచులు నిర్వహించబడతాయి. ఈ సీజన్ లో 7 జట్లు తలపడనున్నాయి. అమరావతి రాయల్స్ కెప్టెన్ గా హనుమ విహారి, భీమవరం బుల్స్ కెప్టెన్ గా నితీష్ కుమార్ రెడ్డి, విజయవాడ సన్ షైనర్స్ కెప్టెన్ గా అశ్విన్ హెబ్బర్, రాయల్స్ ఆఫ్ రాయల సీమ కెప్టెన్ గా షేక్ రషీద్, కాకినాడ కింగ్స్ కెప్టెన్ గా శ్రీకర్ భరత్, తుంగభద్ర వారియర్స్ కెప్టెన్ గా మహీప్ కుమార్, సింహాద్రి వైజాగ్ లయన్స్ కెప్టెన్ గా రికీ భూయి ఉన్నారు.
ప్రతి జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు, Under‑19, Under‑16 యువ ఆటగాళ్లను తప్పకుండా చేర్చడాన్ని నిర్వాహకులు నిర్ధారించారు. ప్రారంభోత్సవ వేడుకలలో కార్యక్రమాల అనంతరం మొదటి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ తో అమరావతి రాయల్స్ తలపడ్డారు. మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచి అమరావతి రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆసక్తిగా సాగుతున్న సమయంలో వర్షం కారణంగా.. మ్యాచ్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలోకి వెళ్ళింది.
కాకినాడ కింగ్స్ కెప్టెన్ శ్రీకర్ భరత్(93), సాయి రాహుల్(96) ఇద్దరు కలిసి 183 పరుగులు చేసారు. ఇన్నింగ్స్ చివరలో వికెట్స్ పడినప్పటికీ కేకే భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకి 229/5 పరుగులు చేసారు. వర్షం కారణంగా డీఎల్ఎస్ పద్దతి ప్రకారం అమరావతి రాయల్స్ 13.2 ఓవర్లలో 174 లక్ష్యంతో బరిలోకి దిగారు. కాకినాడ కింగ్స్ నుండి పిన్నింటి తపస్వి 4 వికెట్లు తీసి అమరావతి రాయల్స్ పై ఒత్తిడి తెచ్చాడు.
మొదట్లో కాస్త ఒత్తిడికి గురైన రాయల్స్ కెప్టెన్ హనుమ విహారి, కరణ్ షిండే ఆకర్షణీయమైన ఇన్నింగ్స్ చేసారు. వీరికి తోడుగా చివర్లో ఆకుల విజయ్, రాజ్ లు కూడా రాణించడంతో 13.2 ఓవర్లలో 173/5 పరుగులు చేసి రాయల్స్ విజయం సాధించారు. పాయింట్స్ పట్టికలో మొదటి గెలుపుని జోడించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హనుమ విహారి, అత్యధిక స్కోరర్ సాయి రాహుల్, టాప్ బౌలర్ గా తపస్వి లు పురస్కారాలను అందుకున్నారు.


