HomeఆటKamareddy: కామారెడ్డికి అరుదైన గౌరవం.. క్రీడారంగంలో సేవలకు గుర్తింపు

Kamareddy: కామారెడ్డికి అరుదైన గౌరవం.. క్రీడారంగంలో సేవలకు గుర్తింపు

కామారెడ్డి(తెలుగు ప్రభ): తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కామారెడ్డికి చెందిన ప్రముఖ విద్యావేత్త, ఆర్కే గ్రూప్ సీఈఓ, కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, కామారెడ్డి ఒలింపిక్ డే రన్ చైర్మన్ డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి నియమితులయ్యారు. క్రీడారంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ నియామకాన్ని తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. మల్లారెడ్డి అధికారికంగా ధ్రువీకరించారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా మాజీ మంత్రి వేణుగోపాల్ చారి, కన్వీనర్‌గా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వ్యవహరిస్తున్న అడ్వైజరీ కమిటీలో కామారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ జైపాల్ రెడ్డికి చోటు దక్కడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూనే క్రీడల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న జైపాల్ రెడ్డి, విద్యార్థులు, యువతను అథ్లెటిక్స్‌తో పాటు వివిధ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. క్రీడల పట్ల యువతలో ఆసక్తిని పెంపొందిస్తూ, ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల జిల్లా క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

- Advertisement -

క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం ..

తనకు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు స్టేట్ ఒలింపిక్ కమిటీకి డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ క్రీడారంగ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కామారెడ్డి జిల్లా క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సముచిత స్థానం లభించేలా కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు వివిధ క్రీడా విభాగాల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేలా అవసరమైన ప్రోత్సాహం అందిస్తానని చెప్పారు. క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి మరింత మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, ఆరోగ్యం, మానసిక ఉల్లాసం లభిస్తాయని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని వివరించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులు, విద్యార్థులకు ఎల్లప్పుడూ తన వంతు సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తానని స్పష్టం చేశారు.

జిల్లా క్రీడా వర్గాల్లో హర్షం..

డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులవడం పట్ల కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, కళాశాలల అధ్యాపక బృందాలు, విద్యార్థులు, స్థానిక అథ్లెట్లు, క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా క్రీడాకారుల అభివృద్ధికి ఆయన నియామకం మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ డాక్టర్ జైపాల్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ నియామకంతో కామారెడ్డి జిల్లా క్రీడారంగంలో మరింత పురోగతి సాధిస్తుందని క్రీడా వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News