Lionel Messi : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022లో అర్జెంటీనా జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది. రౌండ్-16లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. కాగా.. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమిలైన తరువాత అర్జెంటీనా చాలా త్వరగా గట్టిగా పుంజుకుంది.
మ్యాచ్ ప్రారంభమైన 35వ నిమిషంలో మెస్సీ గోల్ చేసి అర్జెంటీనాను 1-0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. తొలి అర్థభాగం ముగిసేవరకు అర్జెంటీనా తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. రెండో అర్థభాగం ఆరంభమైన కాసేపటికే 57 నిమిషం వద్ద అల్వరెజ్ అర్జెంటీనాకు రెండో గోల్ అందించాడు. దీంతో 2-0 ఆధిక్యంతోకి అర్జెంటీనా దూసుకువెళ్లింది. పట్టువదలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు పదే పదే అర్జెంటీనా గోల్ పోస్ట్‌పై దాడులు పెంచారు. ఫలితంగా 77వ నిమిషం వద్ద క్రేగ్ గుడ్‌విన్ బంతిని గోల్ పోస్ట్ కి పంపి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. ఆ తరువాత అర్జెంటీనా ఆటగాళ్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మ్యాచ్ ముగిసే వరకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో అర్జెంటీనా విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకువెళ్లింది. క్వార్టఫైనల్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
తన కెరీర్‌లో 1000వ మ్యాచ్ ఆడిన అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ కళ్లు చెదిరే గోల్ చేసి ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా రికార్డును బద్దలు కొట్టాడు. మారడోనా ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 8 గోల్స్ చేయగా తాజా గోల్‌తో కలిపి మెస్సీ 9 గోల్స్ చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు మెస్సీ 789 గోల్స్ చేశాడు.