బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఇంగ్లండ్ లో జరిగిన కౌంటీ మ్యాచుల్లో షకీబ్ బౌలింగ్ యాక్షన్ పై ఫిర్యాదులు రాగా.. అనంతరం అతనిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఫామ్ పరంగా కూడా షకీబ్ దారుణ పరిస్థితిని ఎదుర్కుంటున్నాడు. ఇక తాజాగా బంగ్లాదేశ్ జట్టు.. షకీబ్ ను ఛాంపియన్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే షకీబ్ కు మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఓ చెక్ బౌన్స్ కేసులో.. షకీబ్ పై ఢాకా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఢాకా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జియాదుర్ రెహమాన్ ఆదివారం షకీబ్ అల్ హసన్‌తో పాటు మరో ముగ్గురిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసు ఐఎఫ్‌ఐసి బ్యాంక్ రిలేషన్‌షిప్ ఆఫీసర్ షాహిబుర్ రెహమాన్ దాఖలు చేయగా, రెండు చెక్కుల ద్వారా సుమారు 41.4 మిలియన్ టాకా అంటే సుమారుగా భారత కరెన్సీలో 3 కోట్ల భారతీయ రూపాయలు చెల్లించాల్సి ఉంది.. అయితే ఈ మొత్తాన్ని షకీబ్ చెల్లించక పోవడంతో.. అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
షకీబ్ సంస్థ అల్ హసన్ ఆగ్రో ఫామ్ లిమిటెడ్ ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ కంపెనీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఘాజీ షాగీర్ హుస్సేన్, డైరెక్టర్లు ఇమ్దాదుల్ హక్, మలైకర్ బేగం పేర్లు కూడా ఈ కేసులో ఉన్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి నిరాకరించారు. దేశంలో జరుగుతున్న రాజకీయ అశాంతి, భద్రతాపరమైన సమస్యలు, ఇంకా చట్టప్రక్రియల కారణంగా దేశంలోకి తిరిగి రావట్లేదని తెలుస్తోంది. ప్రస్తుతం షకీబ్ కుటుంబం అమెరికాలో స్థిరపడగా.. ఆయన బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు.