Arshdeep : తమపై ప్రేమను, కోపాన్ని వ్యక్తం చేసే హక్కు అభిమానులకు ఉందని టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు రెండింటినీ అంగీకరించాల్సి ఉంటుందని చెప్పాడు.
ఆసియా కప్ 2022లో సూపర్-4లో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్.. అసిఫ్ అలీ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. భారత ఓటమికి ఇదీ కూడా ఓ కారణం. మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్‌పై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఖలిస్తానీ జాతీయ క్రికెట్ జట్టుకు అర్ష్‌దీప్ ఎంపిక అయ్యాడు అంటూ అతడి వికీపీడియా పేజిలో కొందరు మార్పులు చేశారు. ఈ విషయంపై స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక వికీపీడియా సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరింది.
నాటి ట్రోలింగ్‌పై అర్ష్‌దీప్ తాజాగా స్పందించాడు. “చాలా మంది వ్యక్తులు మమ్మల్ని, మా ఆటను ఆరాధిస్తారు. మేము మా అత్యుత్తమ ప్రదర్శనను అందించినప్పుడు ప్రజలు మమ్మల్ని ప్రేమిస్తారు. అలాగే విఫలం అయినప్పుడు సైతం అంతే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. దేశం తరుపున ఆడుతున్నాం కాబట్టి మా విషయంలో వారు అంతలా భావోద్వేగానికి లోనవుతుంటారు. మాపై కోపగించుకునే హక్కు వారికుంది. క్రికెటర్‌గా ఈ రెండింటినీ మేం స్వీకరించాల్సి ఉంటుంది.” అంటూ అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు.