Arshdeep Singh top 5 Indian bowlers list : గ్రౌండ్‌లో తన పదునైన యార్కర్లతో బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్.. తాజాగా మైదానం వెలుపల తన మాటలతో మరోసారి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాడు. ఒక ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడుతూ సీనియర్ స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్‌కు కెమెరా ముందే బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
టాప్-5 బౌలర్ల ఎంపిక.. అశ్విన్‌కు చివరి స్థానం : ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ‘కృష్ణాంక్ ఆత్రేయ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అర్షదీప్ సింగ్ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా.. తన దృష్టిలో అత్యుత్తమ నైపుణ్యాలు, గ్రేట్ స్కిల్స్ కలిగిన ఐదుగురు భారతీయ బౌలర్ల పేర్లను ఆయన వరుసక్రమంలో వెల్లడించారు. ఆ జాబితాలో భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు దక్కింది. అయితే ఈ ర్యాంకింగ్స్ ఇచ్చే క్రమంలోనే సీనియర్ స్పిన్నర్ అశ్విన్ పేరును ఆఖరి స్థానంలో (ఐదో స్థానం) చెప్పాల్సి రావడంతో అర్షదీప్ కాస్త తడబడ్డాడు. ఆ మహానుభావుడిని చివర్లో ఉంచడం ఇష్టంలేకపోయినా, పరిస్థితులరీత్యా అలా జరిగిందని వివరిస్తూ అతడు నవ్వులు పూయించాడు.
ఒక్కో ప్లేస్‌కు అర్షదీప్ ఇచ్చిన కారణాలు ఇవే..
మొదటి స్థానంలో భువనేశ్వర్ కుమార్: తనకు పర్సనల్‌గా స్వింగ్ కింగ్ భువీ అంటే ఇష్టమని, ఆయనపై ఉన్న ప్రత్యేక అభిమానంతోనే తొలి స్థానం కేటాయించినట్లు అర్షదీప్ స్పష్టం చేశారు.
రెండో స్థానంలో మహ్మద్ షమీ: ఏ పిచ్‌పై అయినా సరే బంతిని అద్భుతంగా సీమ్ చేయగల అసాధారణ టాలెంట్ షమీ సొంతమని, అందుకే ఆయనకు రెండో స్థానం దక్కిందని కొనియాడారు.
మూడో స్థానంలో కుల్దీప్ యాదవ్: ప్రపంచ క్రికెట్‌లో మరెవరికీ లేని విభిన్నమైన చైనామన్ బౌలింగ్ శైలి కుల్దీప్ సొంతమని ప్రశంసల జల్లు కురిపించారు.
నాలుగో స్థానంలో యుజ్వేంద్ర చాహల్: డొమెస్టిక్ క్రికెట్‌లో పంజాబ్ తరఫున ఇద్దరం కలిసి ఆడామని, చాహల్ రికార్డులే ఆయన గొప్పతనాన్ని చెబుతాయని పేర్కొన్నారు.
ఐదో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్: ఇక చివరిదైన ఐదో స్థానం అశ్విన్‌కు కేటాయించాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న సమయంలో అశ్విన్ తనకు తొలి కెప్టెన్ అని అర్షదీప్ గుర్తుచేసుకున్నారు.
“అశ్విన్ భాయ్ సారీ.. పర్సనల్‌గా మెసేజ్ పెడతా” : అంతటి దిగ్గజ స్పిన్నర్, మేధావి బౌలర్ అయిన అశ్విన్‌ను తన టాప్-5 లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉంచడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అర్షదీప్ తెలిపారు. కానీ, ఆ ఐదుగురిలో ఎవరినో ఒకరిని చివర్లో పెట్టాల్సి రావడంతో ఈ పొరపాటు జరిగిందని సరదాగా వ్యాఖ్యానించారు. “అశ్విన్ భాయ్.. నిన్ను చివర్లో పెట్టక తప్పలేదు, క్షమించు. నేను నీకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తా” అంటూ కెమెరా వైపు చూస్తూ నవ్వులు పండించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అర్షదీప్ ఇంటెన్షన్, ఆయన సరదా స్వభావాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

