Sanju Samson- Chennai Super Kings:ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తున్న కొద్దీ ట్రేడ్ విండో చర్చలు ఉత్కంఠభరితంగా మారాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) , రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య సంజు శాంసన్ ట్రేడ్ వార్తలు క్రీడాభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తించాయి. చెన్నై జట్టులోకి సంజు చేరే అవకాశం దాదాపుగా ఖరారైనట్టుగా మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీంతో అభిమానుల్లో పెద్ద ప్రశ్న ఏదంటే.. సంజు శాంసన్ చెన్నై తరఫున కెప్టెన్ అవుతాడా లేదా?
సమీప కాలంలో ఈ అంశంపై చెన్నై మాజీ స్టార్ ఆటగాడు ఆర్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన అభిప్రాయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అశ్విన్ చెబుతున్నది ఏంటంటే.. చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య సంజు ట్రేడ్ జరగడం ఖాయం అనే నమ్మకం తనకూ ఉందని, కానీ కొత్తగా చేరే ఆటగాడికి వెంటనే కెప్టెన్సీ అప్పగించడం కష్టం అని అన్నారు.
Also read: https://teluguprabha.net/sports-news/india-vs-south-africa-test-series-team-selection-dilemma/
అనుభవజ్ఞుడే అయినా..
అశ్విన్ తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ, సంజు శాంసన్ చెన్నై జట్టులో చేరినా మొదటి ఏడాదిలోనే నాయకత్వ బాధ్యతలు చేపట్టడం సాధ్యం కాదని తెలిపారు. ఆయన ప్రకారం, “సంజు అనుభవజ్ఞుడే అయినా చెన్నైకి ఇది అతని తొలి సీజన్ అవుతుంది. కొత్త వాతావరణంలో ఒక ఆటగాడికి సమయం కావాలి. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్‌నే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం ఎక్కువ” అని వ్యాఖ్యానించారు.
మిడిల్ ఆర్డర్‌లో…
చెన్నై ఫ్రాంచైజ్ ఇప్పటికే రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్ వంటి ఆటగాళ్లను ట్రేడ్ చేయడానికి సిద్ధమవుతోందన్న వార్తలు వెలువడ్డాయి. సంజు శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకోవడం ద్వారా మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వం పెంచాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం దాదాపుగా పూర్తయిందని సమాచారం. అంటే, 2026 సీజన్‌లో పసుపు జెర్సీలో సంజు శాంసన్ కనిపించే అవకాశం చాలా ఉంది.
సంజు శాంసన్ 2021 నుంచి 2025 వరకు రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా 67 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. అతని నాయకత్వంలో జట్టు పలు కీలక విజయాలు సాధించింది. అయితే, రాజస్థాన్ జట్టు క్రమంగా మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. చెన్నై నుండి జడేజా, కర్రాన్‌లను తీసుకోవడం ద్వారా జట్టులో అనుభవం మరియు ఫినిషింగ్ శక్తిని పెంచుకోవాలని వారు భావిస్తున్నారు.
అశ్విన్ మాట్లాడుతూ రాజస్థాన్ ఈ ఒప్పందం వల్ల లాభపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రకారం, జడేజా వంటి ఆటగాడు మిడిల్ ఓవర్లలో మరియు డెత్ ఓవర్లలో జట్టుకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాడు. షిమ్రాన్ హెట్మైర్‌పై ఉన్న బాధ్యతను కొంతవరకు తగ్గించే సామర్థ్యం జడేజాకు ఉందని ఆయన తెలిపారు. గత కొన్ని సీజన్లలో రాజస్థాన్‌కు స్థిరమైన ఫినిషర్ దొరకకపోవడంతో జడేజా వంటి ఆటగాడు జట్టులో ఉండటం పెద్ద మైనస్‌ను పూడుస్తుందన్నారు.
అత్యుత్తమ ఫినిషర్లలో..
జడేజా ఐపీఎల్‌లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. డెత్ ఓవర్లలో అతని స్ట్రైక్‌రేట్ 150కు పైగా ఉండటం, స్పిన్నర్లపై వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం ఉండటం అతనికి అదనపు బలం. చెన్నై తరఫున 2012 నుంచి 2025 వరకు 186 మ్యాచ్‌లు ఆడిన జడేజా జట్టుకు అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
భవిష్యత్తు నాయకుడు..
అశ్విన్ మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆయన అభిప్రాయంలో, సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరితే అది జట్టుకు దీర్ఘకాలంలో లాభదాయకం అవుతుంది. అయితే మొదటి ఏడాది నాయకత్వం విషయమై త్వరిత నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. “సంజు అనేది భవిష్యత్తు నాయకుడు అవుతాడనే నమ్మకం నాకు ఉంది. కానీ ఈ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌నే కొనసాగిస్తారని అనుకుంటున్నా” అని ఆయన అన్నారు.
రుతురాజ్ గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి సమతుల్యమైన ప్రదర్శన ఇచ్చాడు. ధోని తర్వాత అతడిని నాయకత్వ బాధ్యతలు చేపట్టమని ఫ్రాంచైజ్ నమ్మకంతో ముందుకు తెచ్చింది. అందుకే కొత్త ఆటగాడికి వెంటనే ఆ పదవి అప్పగించడం ఫ్రాంచైజ్ వ్యూహానికి విరుద్ధమని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
ధోని యుగం ముగిసిన తర్వాత..
ఇక ట్రేడ్ విండోలో జరుగుతున్న ఈ పెద్ద మార్పులు ఐపీఎల్ 2026 సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చబోతున్నాయి. సంజు శాంసన్, జడేజా, కర్రాన్ వంటి పేర్లు ఒకే సమీకరణంలో ఉండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. చెన్నై కొత్త సీజన్‌లో తన జట్టును రీబిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. ధోని యుగం ముగిసిన తర్వాత కొత్త నాయకత్వం కింద జట్టు కొత్త దిశగా అడుగులు వేస్తోంది.
సంజు శాంసన్ చెన్నై జట్టులో చేరితే అది కేవలం ఆటగాడి మార్పు మాత్రమే కాకుండా, జట్టు వ్యూహపరంగా కూడా పెద్ద మార్పు అవుతుంది. అతని బ్యాటింగ్ శైలి, అనుభవం, స్తైర్యం జట్టుకు మద్దతు ఇవ్వగలవు. మరోవైపు, రాజస్థాన్ జట్టు జడేజాను పొందడం ద్వారా మిడిల్ ఆర్డర్‌లో బలాన్ని పెంచుకోనుంది.


