Asia Cup 2025 Pak vs Ban: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్స్ పోరులో పాకిస్థాన్ జట్టుకు బంగ్లాదేశ్ బౌలర్లు చుక్కలు చూపెట్టారు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టి.. పాక్‌ను కేవలం 135 పరుగులకే కట్టడి చేశారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు తక్కువ స్కోరుకే పరిమితమైంది.
పాకిస్థాన్‌తో పోరులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. బౌలింగ్ ఎంచుకుంది. పటిష్ఠమైన ప్రణాళికతో గ్రౌండ్‌లోకి దిగిన బౌలర్లు తమ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆరంభం నుంచే వికెట్లు పడగొట్టి పాకిస్థాన్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించారు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (4) ఔటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన సయీమ్ అయ్యూబ్ (0) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు.
ఫఖర్ జమాన్ (13), కెప్టెన్ సల్మాన్ అఘా (19) లాంటి కీలక ఆటగాళ్లు సైతం క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో స్కోరు నెమ్మదిగా సాగింది. పాక్ బ్యాటర్లలో మహమ్మద్ హారిస్ (31) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించగా.. చివర్లో మహమ్మద్ నవాజ్ (25), షాహీన్ అఫ్రిది (19) వేగంగా పరుగులు చేశారు. దీంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో పేసర్ టాస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్నర్లు మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్ చెరో రెండు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ఒక వికెట్ సాధించాడు.
కాగా, 136 పరుగుల తక్కువ స్కోరు ఛేదనకి బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది తన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ పర్వేజ్ హొస్సేన్ ఇమొన్‌ను (0) డకౌట్‌గా వెనక్కి పంపాడు. తాజా సమాచారం నాటికి బంగ్లాదేశ్ 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ నువ్వా- నేనా అన్నట్లుగా రసవత్తరంగా సాగుతోంది.


