Ind vs Pak final, Asia Cup 2025: మరికొన్ని గంటల్లో భారత్, పాక్ మధ్య పైనల్ పోరు జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో ఇప్పటికే టీమిండియా చేతిలో రెండు సార్లు చావు దెబ్బతిన్న పాకిస్థాన్..తుదిపోరులో ఎలాగైనా గెలవాలన్న కసితో బరిలోకి దిగుతోంది. మరోసారి దాయాదిని మట్టికరిపించి తమ ప్రజల ముందు సగర్వంగా తలెత్తుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే మ్యాచ్ కు ముందు పాక్ జట్టు ఇద్దరిని చూసి భయపడుతోంది. వారే యంగ్ సంచలనం అభిషేక్ శర్మ, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.
అభిషేక్ శర్మ
ఆసియా కప్ లో ఈ యంగ్ ఓపెనర్ తన భీకర ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే స్టాండ్స్ లోకి పంపించి ప్రత్యర్థి బౌలర్లకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాడు. సూపర్ 4 దశలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి తన ఎంత ప్రమాదకారో అన్ని జట్లకు తెలిసేలా చేశాడు. ఈ మెగా టోర్నీలో ఆరు మ్యాచ్ లు ఆడిన అభిషేక్ 51.50 సగటుతో 204.63 స్ట్రైక్-రేట్‌తో 309 పరుగులు చేశాడు.
Also read: Asia Cup 2025-ఫైనల్ కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లకు గాయాలు..
కుల్దీప్ యాదవ్
ఆసియా కప్‌లో టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు కుల్దీప్. ఆరు ఇన్నింగ్స్‌లలో 6.04 ఎకానమీతో 13 వికెట్లు తీసి తన సత్తా ఏంటో ప్రత్యర్థులకు రుచి చూపించాడు. టీ20 ఆసియా కప్‌లో ఒకే ఎడిషన్‌లో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్న యూఏఈకి చెందిన అమ్జాద్ జావేద్(12) రికార్డును అతను బద్దలు కొట్టాడు. జావేద్ ఈ ఫీట్ ను 2016 ఆసియా కప్ లో సాధించగా.. ఇప్పుడు దానిని కుల్దీప్ చెరిపేశాడు. ఇప్పటి వరకు భారత్ తరుపున కుల్దీప్ 46 టీ20ల్లో 82 వికెట్లు, 113 వన్డేల్లో 181 వికెట్లు తీశాడు. పైనల్లో కుల్దీప్ కీలకం కానున్నాడు.


