Asia Cup 2025 Points Table: 2025 ఆసియా కప్‌లో భారత్ తన మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సూపర్ 4 రౌండ్‌కు అర్హత సాధించింది. టీమిండియా తన తొలి మ్యాచ్ లో యూఏఈ, సెకండ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గెలుపొందింది. ఈ మెగాటోర్నీలోని ప్రతి గ్రూప్‌లోని జట్లు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. రౌండ్-రాబిన్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో ఉన్న రెండేసి జట్లు సూపర్ 4 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. గ్రాండ్ ఫైనల్ సెప్టెంబరు 28న జరగనుంది.
ఆదివారం పాక్ పై భారత్ గెలుపు పాయింట్ల టేబుల్ సమీకరణాలు మారిపోయాయి. గ్రూప్-ఏలో ఆడిన రెండు మ్యాచుల్లో నెగ్గి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా. దీంతో సూపర్ 4 కు అర్హత కూడా సాధించింది. మరోవైపు పాకిస్థాన్ ఒక మ్యాచ్ లో మాత్రమే నెగ్గి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఒమన్, యూఏఈ ఆడిన ఒక్కో మ్యాచ్ లో ఓడిపోయి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇప్పటికే భారత్ సూపర్ 4కు చేరగా.. మిగతా ఒక్క స్థానం కోసం పాక్, ఓమన్, యూఏఈ పోటీపడుతున్నాయి. మిగతా రెండు టీమ్స్ కంటే పాక్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఇక గ్రూప్-బి విషయానికొస్తే.. ఆఫ్గానిస్తాన్ ఆడిన ఒక్క మ్యాచ్ లో భారీ నెట్ రన్ రేట్ తో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత శ్రీలంక రెండో స్థానంలో ఉంది. రెండు మ్యాచుల్లో ఒక మ్యాచ్ నెగ్గి, ఒక మ్యాచ్ ఓడిపోయిన బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. ఇక ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోయి చివరి స్థానంలో నిలిచింది హాంగ్ కాంగ్. ఆప్గాన్, శ్రీలంక జట్లు సూపర్ 4 అర్హత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Asia Cup T20 – పాక్‌పై భారత్ ఘన విజయం
చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్థాన్
ఆసియా కప్ తొలి మ్యాచ్ లో పసికూన యూఏఈను సునాయసంగా నెగ్గిన భారత్.. తన తర్వాత మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఆ జట్టు పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి సూపర్-4కు మరింత చేరువైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ రెండు, బుమ్రా రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన సూర్యసేనా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సూర్య 47, అభిషేక్ 31, తిలక్ వర్మ 31 పరుగులు చేశారు.


