ASIA CUP 2025 IND vs SL: దుబాయ్ వేదికగా సూపర్- 4 చివరి పోరులో భారత జట్టు శ్రీలంకతో తలపడుతోంది. ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్ చేరిన టీమిండియా.. నామమాత్రమైన ఈ మ్యాచ్‌లోనూ విజయంతో టైటిల్ పోరుకు సిద్ధమవ్వాలని చూస్తోంది. కాగా, మరోవైపు వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన లంక.. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఓదార్పు పొందాలనుకుంటోంది. కాగా, టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ అసలంక బౌలింగ్ ఎంచుకున్నాడు.
నామమాత్రమైన మ్యాచ్ కావడంతో ప్రధాన పేసర్ బుమ్రా, ఆల్‌రౌండర్ శివం దూబేలను పక్కనపెట్టి.. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానాలను టీంలోకి తీసుకున్నట్టు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు. మరోవైపు పాక్‌తో మ్యాచ్‌లో విఫలమైన శ్రీలంక.. కరుణరత్నే బదులు లియాంగేను తుదిజట్టులోకి తీసకుంది. భారత్‌ను ఎలాగైనా 170-175లోపు కట్టడి చేయాలని భావిస్తున్నట్టు అసలంక వెల్లడించాడు. కాగా, పొట్టి ఫార్మాట్‌లో లంకపై భారత్‌దే ఆధిక్యం. ఇప్పటివరకూ టీ20ల్లో ఇరుజట్లు 31 సార్లు ఎదురుపడగా టీమిండియా 22 విజయాలతో ఆధిపత్యంతో దూసుకుపోతోంది.
భారత్ తుది జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
శ్రీలంక తుది జట్టు: పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), కుశాల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియనగే, కమిందు మెండిస్, దసున్ శనక, వనిందు హసరంగ, చమీర, థీక్షణ, తుషార.


