Asia Hockey Cup : ఆసియా హాకీ కప్-2025 ఫైనల్‌లో దక్షిణ కొరియాపై భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. దీంతో తదుపరి ప్రపంచకప్ టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధించింది. బిహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన పోరులో భారత్ 4-1 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న దక్షిణ కొరియాను ఓడించి విజేతగా అవతరించింది. భారత జట్టు ఆసియా కప్ గెలవడం ఇది నాలుగోసారి. గతంలో 2003, 2007, 2017లో విజేతగా నిలిచిన భారత్, ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి నిమిషంలోనే సుఖ్‌జీత్ సింగ్ అద్భుతమైన గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత, దిల్‌ప్రీత్ సింగ్ తన అసమాన ప్రతిభను చూపిస్తూ 28వ మరియు 45వ నిమిషాల్లో రెండు కీలకమైన గోల్స్ సాధించారు. ఇక మ్యాచ్ చివరి నిమిషాల్లోనూ దూకుడును కొనసాగిస్తూ, 50వ నిమిషంలో అమిత్ రోహిదాస్ ఒక గోల్ చేసి భారత్ విజయాన్ని సుస్థిరం చేశారు. దక్షిణ కొరియా జట్టు తరపున ఏకైక గోల్‌ను 48వ నిమిషంలో కిమ్ హ్యూన్‌జోంగ్ సాధించారు.
ఈ విజయం భారత హాకీ జట్టుకు ప్రపంచ వేదికపై మరింత నమ్మకాన్ని పెంచింది. ఈ గెలుపుతో భారత్ నేరుగా 2026లో బెల్జియం మరియు నెదర్లాండ్స్‌లో జరగనున్న ప్రపంచ హాకీ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నమెంట్ 2026 ఆగస్టు 14 నుండి 30 వరకు జరగనుంది. ఈ విజయం భారత హాకీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.


