Sunday, July 7, 2024
HomeఆటAUS vs WI : 77 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన వెస్టిండీస్‌

AUS vs WI : 77 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన వెస్టిండీస్‌

AUS vs WI : వెస్టిండీస్ జ‌ట్టుకు ఆస్ట్రేలియా భారీ షాక్ ఇచ్చింది. అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో ఆసీస్ 419 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఫ‌లితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజ‌యంతో ఆస్ట్రేలియా ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ 2023 ఫైన‌ల్ బ‌రిలో నిలిచేందుకు మ‌రింత చేరువైంది. 75 శాతం విజ‌యాల‌తో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంది.

- Advertisement -

497 ప‌రుగుల విజ‌య‌లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వెస్డిండీస్ 77 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ పేస్ త్ర‌యం మిచెల్ స్టార్క్(3/29), మైఖేల్ నెసర్(3/22),, స్కాట్ బొలాండ్(3/16) ల ధాటికి వెస్టిండీస్ బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. వీరి ధాటికి ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. విండీస్ బ్యాట‌ర్ల‌లో ముగ్గురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. 17 ప‌రుగుల‌తో టాగెనరైన్ చంద్రపాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అంత‌క‌ముందు ఆస్ట్రేలియా త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 511/7 స్కోర్ వ‌ద్ద డిక్లేర్ చేసింది. మార్నస్‌ లబుషేన్‌ (163), ట్రావిస్‌ హెడ్‌ (175) లు భారీ శ‌త‌కాల‌తో చెల‌రేగారు. అనంత‌రం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వెస్టిండీస్ 214 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఆసీస్‌కు 297 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. ఫాలోఆన్ ఆడించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఆడించ‌కుండా ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆరు వికెట్లు కోల్పోయిన 199 వ‌ద్ద డిక్లేర్ చేసి విండీస్ ముందు 497 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది.

ఈ ఓటమితో వెస్టిండీస్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హెడ్‌, ప్లేఆయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా ల‌బుషేన్ ను నిలిచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News