ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ పై.. ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది.
ఆస్ట్రేలియా 15 బంతులు మిగిలి ఉండగానే గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఆస్ట్రేలియా తరఫున వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోష్ ఇంగ్లిస్ 120 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కొండంత లక్ష్యాన్ని కంగారులు 5 వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలో ఛేదించారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ శతకం కొట్టాడు. అలెక్స్ కేరీ (69), మాథ్యూ షార్ట్ (63) అర్ధ శతకాలు బాదారు. లబుషేన్ (47) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 43 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ బెన్ డకెట్‌కు స్టార్ ప్లేయర్ జో రూట్ జతకలిశాడు. వీరిద్దరూ వేగంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే బెన్ డకెట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జో రూట్ 78 బంతుల్లో 68 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.
మిగతా బ్యాటర్ల నుంచి ఆశించిన మేర సహకారం లేకపోయినా డకెట్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 143 బంతుల్లో 165 రన్స్ స్కోరు చేశాడు. 48వ ఓవర్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్ ధాటిగా ఆడటంతో ఇంగ్లాండ్ 350 పరుగుల మార్కును అందుకుంది. ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మ్యాచ్‌లో మొత్తం 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.