AUS vs IND: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో (Border – Gavaskar Trophy 2024) భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. శనివారం ఉదయం గబ్బా వేదికగా మొదలైన మ్యాచ్‌లో తొలి రోజు వర్షార్పణం అయింది. ఏకధాటికి వర్షం పడుతూనే ఉండంటతో కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజ్‌లో నాథన్ మెక్‌స్వీనీ (4), ఉస్మాన్ ఖవాజా (19) ఉన్నారు.
శనివారం కేవలం గంట ఆట మాత్రమే సాధ్యం కావడంతో రెండో రోజు అయిన ఆదివారం ఓవర్లను పొడిగిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. వాతావరణం అనుకూలిస్తే 98 ఓవర్లపాటు ఆట జరిగే అవకాశం ఉంది. అలాగే ఆటను కూడా అరగంట ముందుగానే ప్రారంభిస్తారు. అయితే వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఈ వారమంతా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో మ్యాచ్ ఐదు రోజుల పాటు కొనసాగుతుందా..? లేదా..? అని అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.
మరోవైపు మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన అభిమానులకు క్రికెట్ ఆస్ట్రేలియా టికెట్ల సొమ్మును రిఫండ్ చేస్తామని ప్రకటించింది. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్టులో భారత్ గెలవగా.. రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.