Azharuddin Warns Pakistan: ఆసియా కప్ లో టైటిల్ ఫేవరేట్ గా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా బరిలోకి దిగింది. కాగా.. యూఏఈతో అలవోకగా గెలిచిన భారత జట్టు.. ఈ ఆసియా కప్‌లో మరో సమరానికి సిద్ధమైంది. పాకిస్థాన్‌తో ఇవాళ దుబాయ్ వేదికగా తలపడనుంది. అయితే, పాక్ జట్టు మాత్రం సీనియర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ లేకుండానే బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై భారీ విజయం సాధించినా.. ఇప్పుడు టీమ్‌ఇండియాతో పోరు మాత్రం అంత ఈజీ కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ వ్యాఖ్యానించాడు. భారత జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నారని గుర్తు చేశాడు. ఓ జాతీయ ఛానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరు జట్ల మధ్య పోరులో టీమ్‌ఇండియానే విజయం సాధిస్తుందని స్పష్టం చేశాడు. ‘‘భారత జట్టులో సూపర్ ప్లేయర్లు ఉన్నారు. అత్యుత్తమ ప్రదర్శన చేసే ఆటగాళ్లు మన సొంతం. మరోవైపు పాకిస్థాన్ మాత్రం చాలా బలహీనంగా ఉంది. టీమ్‌ఇండియాకు పోటీ ఇచ్చే స్థితిలోనూ లేదు. ఆ జట్టులో అత్యుత్తమ ప్లేయర్లు లేరు. బాబర్ అజామ్, రిజ్వాన్‌ను పక్కన పెట్టారు. అయితే, క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. భారత జట్టు చాలా స్ట్రాంగ్‌గా ఉంది’’ అని అజహరుద్దీన్ వ్యాఖ్యానించాడు.
Read Also: Bigg Boss Promo Today: కెప్టెన్ కే అన్ని అధికారాలు.. మతిమరుపుకి మందు వేసుకోమన్న నాగ్
నిఖిల్ చోప్రా ఏమన్నారంటే?
అంతేకాకుండా, భారత జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా కూడా మాట్లాడారు. ‘‘భారత స్క్వాడ్‌ను చూస్తే ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అనుభవం కలిగిన ప్లేయర్లు ఉండటం నిజంగా అద్భుతం. యశస్వి జైస్వాల్ వంటి క్రికెటర్‌కే చోటు దక్కలేదంటే భారత జట్టులో పోటీ ఎంత ఎక్కువో తెలుస్తోంది. తుది జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌కూ అవకాశం ఇవ్వలేని పరిస్థితి. ముగ్గురు స్పిన్నర్లు అక్షర్, వరుణ్, కుల్‌దీప్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. జస్‌ప్రీత్ బుమ్రాకు తోడుగా పేస్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, శివమ్ దూబె ఫాస్ట్ బౌలింగ్‌ను పంచుకోవడం బాగుంది. తుది జట్టును ఎంపిక చేసుకోవడమే భారత్‌కు సవాల్. దీనింతటికి కారణం బీసీసీఐ తీసుకున్న చర్యలు. ఈ సందర్భంగా ఐపీఎల్‌కూ ధన్యవాదాలు చెప్పాలి’’ అని మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా వెల్లడించాడు.


