ENG vs PAK : ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాక్ స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటైంది. ముఖ్యంగా అరంగ్రేట స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ ధాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి వెన్నులో వణుకుపుట్టించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి ఏడు వికెట్లను అబ్రర్ అహ్మద్ తీశాడు. జహీద్ మహ్మద్ ముడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ పది వికెట్లను కూడా స్పిన్నర్లే పడగొట్టడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు ఏదీ కలిసి రాలేదు.గత మ్యాచ్‌లో సెంచరీలు బాదిన జాక్ క్రాలీ(19), హారీ బ్రూక్(9) విఫలం కాగా బెన్ డక్కెట్(63), ఓలీ పోప్(60) లు అర్థశతకాలతో రాణించారు. అయితే అబ్రర్ ధాటికి వీళ్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. మాజీ కెప్టెన్ జోరూట్(8) తన చెత్త ఫామ్‌ను కొనసాగించడంతో 33 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులతో ఇంగ్లాండ్ లంచ్ కు వెళ్లింది.
రెండో సెషన్‌లో కూడా ఇంగ్లీష్ బ్యాటర్లు స్పిన్ ఆడడంలో తమ బలహీనతను కొనసాగించారు. ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ బెన్ స్టోక్స్(30), విల్ జాక్స్(31) లను అబ్రర్ పెవిలియన్ చేర్చాడు. ఓలీ రాబిన్సన్(5), జాక్ లీచ్(0), జేమ్స్ అండర్సన్(7)లను జహీద్ మహ్మద్ బుట్టలో వేసుకోవడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సేపు పట్టలేదు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ తొలి రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ 61 పరుగులతో, సౌద్ షకీల్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.