IND vs BAN 2nd Test : ఢాకా వేదికగా భారత్‌తో జరుగుతున్న టెస్టులో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లు రాణించడంతో బంగ్లా 231 పరుగులకు ఆలౌటైంది. దీంతో 144 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే బంగ్లాదేశ్‌కు దక్కింది.
ఓవర్‌నైట్ స్కోర్ 7/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే గట్టి షాకిచ్చారు భారత బౌలర్లు. ఓపెనర్ శాంటో(5)తో పాటు వన్ డౌన్ బ్యాటర్ మోమినుల్ హక్(5), కెప్టెన్ షకీబ్ అల్ హసన్(13)లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చారు. దీంతో 51 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి మరో వైపు ఓపెనర్ జాకీర్ హస్సేన్ (51) క్రీజులో పాతుకుపోయాడు. ఆడపాదడపా బౌండరీలు కొడుతూ అర్థశతకం చేశాడు. హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఆ దశలో బంగ్లా కుప్పకూలడానికి ఎంతో సమయం పట్టదని అనిపించింది. అయితే.. లిటన్ దాస్(73) వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. అతడితో పాటు నురుల్ హాసన్(31), తస్కిన్ అహ్మద్(31)లు రాణించడంతో చివరికి బంగ్లాదేశ్ 231 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా, సిరాజ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు, ఉమేష్, ఉనాద్కత్ ఒక్కొ వికెట్ తీశారు. దీంతో భారత్ ముందు 145 పరుగుల లక్ష్యం నిలిచింది.
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.