IND vs BAN 1st Test : టీమ్ఇండియా టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పుజారా దాదాపు నాలుగేళ్ల తరువాత సెంచరీ చేశాడు. చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్న పుజారా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీ చేశాడు. తన శైలికి విరుద్దంగా ఆడిన పుజారా కేవలం 130 బంతుల్లోనే టెస్టుల్లో 19వ శతకాన్ని అందుకున్నాడు. పుజారా తన కెరీర్‌లో చేసిన సెంచరీల్లో ఇదే ఫాస్టెస్ట్ శతకం కావడం విశేషం. 1443 రోజుల తరువాత పుజారా సెంచరీ చేయడం గమనార్హం. 52 ఇన్నింగ్స్‌ల తరువాత మూడంకెల స్కోర్ అందుకుని శతకాల కరువును తీర్చుకున్నాడు. మధ్యలో పుజారా జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ సెంచరీని మాత్రం అందుకోలేకపోయాడు.
ఛతేశ్వర పుజారాతో పాటు ఓపెనర్ శుభ్‌మన్ గిల్(110) కూడా సెంచరీ చేయడంతో టీమ్ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 258/2 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 512 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. శాంటో 25, జాకీర్ హాసన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే మరో 471 పరుగులు అవసరం కాగా.. భారత్ విజయం సాధించాలంటే 10 వికెట్లు తీయాలి.
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.