Friday, November 22, 2024
HomeఆటIND vs BAN 2nd Test : భార‌త్‌కు 87 ప‌రుగుల ఆధిక్యం

IND vs BAN 2nd Test : భార‌త్‌కు 87 ప‌రుగుల ఆధిక్యం

IND vs BAN 2nd Test : భార‌త్, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. బంగ్లాదేశ్ త‌న రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 7 ప‌రుగులు చేసింది. జ‌కీర్ హ‌స‌న్ (2), షాంటో(5) క్రీజులో ఉన్నారు. అంత‌క‌ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 314 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

- Advertisement -

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 19/0తో రెండో రోజు ఆటను కొన‌సాగించిన భార‌త్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్‌(10), శుభ్‌మ‌న్ గిల్‌(20)లు ఔటైయ్యారు. వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ పుజ‌రా(24)తో క‌లిసి ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ(24) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే.. వీరిద్ద‌రు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. దీంతో భార‌త్ 94 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

ఈ ద‌శ‌లో యువ ఆట‌గాళ్లు రిష‌బ్ పంత్‌(93), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(87)లు భార‌త్‌ను ఆదుకున్నారు. ముఖ్యంగా పంత్ బంగ్లా బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప‌ట్ట‌ప‌గ‌లే బంగ్లా బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. మ‌రోవైపు శ్రేయ‌స్ అయ్య‌ర్ సైతం త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌ట్టాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు అర్థ‌శ‌త‌కాలు పూర్తి చేసుకున్నారు. హాఫ్ సెంచ‌రీ త‌రువాత కూడా పంత్ అదే దూకుడును కొన‌సాగించ‌డంతో స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టింది.

అయితే శ‌త‌కానికి ఏడు ప‌రుగుల దూరంలో రిష‌బ్‌ను మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ బోల్తా కొట్టించాడు. దీంతో 159 ప‌రుగుల ఐదో వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. పంత్ ఔటైన త‌రువాత మ‌రోసారి భార‌త్ వేగంగా వికెట్లు కోల్పోయింది. అక్ష‌ర్ (4), ర‌విచంద్ర‌న్ అశ్విన్‌(13), శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఉమేష్‌(14), సిరాజ్‌(7) ఔట్ కావ‌డంతో 314 ప‌రుగుల వ‌ద్ద భార‌త తొలి ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా బౌల‌ర్ల‌లో తైజుల్ ఇస్తామ్‌, ష‌కీబ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. త‌స్కిన్‌, మెహిదీ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

కాగా.. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్‌ 227 పరుగులకే ఆలౌట్ సంగ‌తి తెలిసిందే. దీంతో భార‌త్ కు 87 ప‌ర‌గుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News