Friday, November 22, 2024
HomeఆటIndia vs Bangladesh : నొప్పిని భ‌రిస్తూ రోహిత్ ఒంట‌రి పోరు.. అయినా సిరీస్ పాయే

India vs Bangladesh : నొప్పిని భ‌రిస్తూ రోహిత్ ఒంట‌రి పోరు.. అయినా సిరీస్ పాయే

India vs Bangladesh : ఆఖ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజ‌యం సాధించింది. టీమ్ఇండియా గెల‌వాలంటే ఆఖ‌రి రెండు బంతుల్లో 12 ప‌రుగులు అవ‌స‌రం అయిన ద‌శలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సిక్స్ కొట్ట‌డంతో చివ‌రి బంతికి 6 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. అయితే.. ముస్తాఫిజుర్ రెహమాన్ సూప‌ర్ యార్క‌ర్‌తో రోహిత్‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో బంగ్లాదేశ్ 5 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఫ‌లితంగా 3 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే కైవ‌సం చేసుకుంది. బంగ్లాదేశ్ గ‌డ్డ‌పై భార‌త్ వ‌న్డే సిరీస్ ఓడిపోవ‌డం వ‌రుస‌గా ఇది రెండో సారి.

- Advertisement -

266 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి భార‌త్‌కు శుభారంభం ల‌భించ‌లేదు. ఫీల్డింగ్ చేస్తూ రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డ‌డంతో శిఖ‌ర్ ధావ‌న్‌(8)తో క‌లిసి విరాట్ కోహ్లీ(5) ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఒక బౌండ‌రీ బాది ఊపుమీద క‌నిపించిన కోహ్లీ జ‌ట్టు స్కోర్ 7 ప‌రుగుల వ‌ద్ద పెవిలియ‌న్‌కు చేరాడు. బంగ్లా బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ప‌రుగులు చేసేందుకు భార‌త బ్యాట‌ర్లు ఇబ్బందులు ప‌డ్డారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో పని ఉన్న‌ట్లు బ్యాట‌ర్లు పోటీప‌డి మ‌రీ ఔటైయ్యారు.

శిఖ‌ర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(11), కేఎల్ రాహుల్‌(14)లు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్‌కు చేర‌డంతో భార‌త్ 65 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో వ‌న్‌డౌన్ బ్యాట‌ర్‌ శ్రేయ‌స్ అయ్య‌ర్‌(82; 102 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) తో జ‌తక‌లిసిన అక్ష‌ర్ ప‌టేల్‌(56; 56బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ఇన్నింగ్స్‌ను న‌డిపించే బాధ్య‌త‌ను త‌మ భుజాలపై వేసుకున్నారు. మంచి బంతుల‌ను గౌర‌విస్తూనే చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ అర్థ‌శ‌త‌కాల‌ను పూర్తి చేసుకున్నారు. ధాటిగా ఆడే క్ర‌మంలో శ్రేయ‌స్ అయ్య‌ర్ జ‌ట్టు స్కోర్ 172 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. వీరిద్ద‌రు ఐదో వికెట్‌కు 107 ప‌రుగులు భాగ‌స్వామ్యాన్ని అందించారు. శ్రేయ‌స్ ఔట్ కావ‌డంతో మ‌రోసారి భార‌త బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. 213 ప‌రుగుల వ‌ద్ద శార్దూల్ ఠాకూర్‌(8) రూపంలో భార‌త్ ఎనిమిద‌వ వికెట్ కోల్పోయింది.

నొప్పిని భ‌రిస్తూ రో ‘హిట్‌

గాయం కార‌ణంగా డ‌గౌట్‌కు ప‌రిమిత‌మైన రోహిత్ శ‌ర్మ‌(51; 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) భార‌త్ ఏడో వికెట్ కోల్పోయిన త‌రువాత క్రీజులోకి అడుగుపెట్టాడు. ఓ వైపు నొప్పిని భ‌రిస్తూనే రోహిత్ సిక్స‌ర్లు, ఫోర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. ఫ‌లితంగా మ్యాచ్ ఉత్కంఠభ‌రితంగా మారింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో విజ‌యానికి 20 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. రోహిత్ క్రీజులో ఉండ‌డంతో మ్యాచ్ పై భార‌త అభిమానులు ఆశ‌లు వ‌దులుకోలేదు. తొలి బంతికి ప‌రుగులు రాలేదు. రెండు, మూడ‌వ బంతుల‌ను రోహిత్ బౌండ‌రీల‌కు త‌ర‌లించాడు. నాలుగో బంతి డాల్ కాగా.. ఐదో బంతిని సిక్స‌ర్‌గా మలిచాడు రోహిత్. దీంతో ఆఖ‌రి బంతికి 6 ప‌రుగులు అవ‌స‌రం.. అయితే ముస్తాఫిజుర్ యార్క‌ర్‌తో రోహిత్‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News