IND vs BAN 1st ODI : ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (73; 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థశతకంతో రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(27; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్), శ్రేయాస్ అయ్యర్(24; 39 బంతుల్లో 2 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్(19; 43 బంతుల్లో) లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా సీనియర్ ఆటగాళ్లు శిఖర్ ధావన్ (7), విరాట్ కోహ్లీ(9)లు ఘోరంగా విఫలం అయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ హల్ అసన్ 5 వికెట్లతో భారత పతనాన్ని శాసించగా హొస్సెన్ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. హసన్ మిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ కు శుభారంభం దక్కలేదు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడుతూనే ఉన్న శిఖర్ ధావన్ జట్టు స్కోర్ 23 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీతో కలిసి రోహిత్ తో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆల్‌రౌండర్ షకీబ్ హల్ అసన్ భారత్‌ను కోలుకోని దెబ్బ తీశాడు. ఒకే ఓవర్‌లో రోహిత్‌తో పాటు కోహ్లీని పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో భారత్ 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును నడిపించే బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు కేఎల్ రాహుల్. అయ్యర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 43, సుందర్‌తో ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 49 బంతుల్లో అర్థశతకం పూర్తి చేశాడు రాహుల్.
సుందర్ ఔటైన తరువాత భారత పతనం వేగంగా సాగింది. రాహుల్‌కు కనీసం సహకరించే వారే కరువు అయ్యారు. ఈ క్రమంలో ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్ జట్టు స్కోరు 178 వద్ద తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిగాడు. అనంతరం భారత ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు.