IND vs BAN 1st ODI : ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి వికెట్‌కు అభేధ్యంగా మెహిదీ మిరాజ్(38; 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ముస్తాఫిజుర్ రెహమాన్(10; 11 బంతుల్లో 2 ఫోర్లు) లు 51 పరుగులు జోడించి బంగ్లాదేశ్ కు అద్భుత విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, ,కుల్‌దీప్ సేన్, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, దీపర్ చాహర్‌లు ఒక్కొ వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య బుధవారం(డిసెంబర్ 7)న రెండో వన్డే జరగనుంది.
అంతకముందు భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (73; 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థశతకంతో రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(27; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్), శ్రేయాస్ అయ్యర్(24; 39 బంతుల్లో 2 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్(19; 43 బంతుల్లో) లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా సీనియర్ ఆటగాళ్లు శిఖర్ ధావన్ (7), విరాట్ కోహ్లీ(9)లు ఘోరంగా విఫలం అయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ హల్ అసన్ 5 వికెట్లతో భారత పతనాన్ని శాసించగా హొస్సెన్ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. హసన్ మిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.