BCCI Action on Bangladesh cricketers: ఓవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు మరోవైపు భారత్, బంగ్లాదేశ్ దేశాల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రికెట్‌పై పెను ప్రభావం చూనుందని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య క్రికెట్, దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ బంగ్లాదేశ్ క్రికెటర్లకు బిగ్ షాక్ తగలనుంది. బంగ్లాదేశ్ క్రికెటర్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న భారత సంస్థ ఎస్‌జీ తమ స్పాన్సర్ షిప్‌ను కొనసాగించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్లు లిటన్ దాస్, మోమినుల్ హక్, యాసిర్ అలీ వంటి క్రికెటర్లకు ఎస్‌జీ స్సాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అయితే, వారి స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదనే ఎస్‌జీ తీసుకున్న నిర్ణయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ఆటగాళ్లకు సంబంధించిన ఏజెంట్లకు ఈ పరిణామం గురించి సూచనలు చేశారు. త్వరలోనే ఎస్‌జీ స్పాన్సర్‌గా వైదొలగొచ్చునని ఓ బంగ్లాదేశ్ క్రికెటర్ ఓ ప్రముఖ వైబ్‌సైట్‌తో అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎస్‌జీ గనుక ఈ నిర్ణయం తీసుకుంటే మిగిలిన సంస్థలు కూడా అదే మార్గంలో నడిచే అవకాశాన్ని సైతం కొట్టి పారేయలేమని సదరు క్రికెటర్ చెప్పినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ముస్తాఫిజుర్ రెహమాన్‌పై బీసీసీఐ నిషేధం..
కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ క్రమంలో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు హిందువులు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లా క్రికెటర్ హిందువలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఐపీఎల్‌లో ఆడకుండా నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముస్తాఫిజుర్ రెహమాన్‌పై నిషేధం విధిస్తూ బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ జట్టు ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించింది. ఈ నిర్ణయంపై బంగ్లా ప్రభుత్వం బీసీసీఐపై అసహనాన్ని వ్యక్తం చేసింది. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తూ ఆదేశాలను జారీ చేసింది. అదే సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో మ్యాచ్‌లు ఆడలేమని, శ్రీలంకకు తమ జట్టు ఆడే మ్యాచ్‌లను తరలించాలని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది. కాగా, బంగ్లాదేశ్ అభ్యర్థనపై ఐసీసీ ఇంత వరకు స్పందించలేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు క్రికెట్‌పైనా ప్రభావం చూపడం ఆసక్తికరంగా మారింది.

