2025 ఐపీఎల్ సీజన్‌లో ఓ యువ క్రికెటర్ ఊహించని విధంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న దిగ్వేష్ రతి అనే స్పిన్నర్, తన బౌలింగ్‌తోనే కాదు.. వికెట్ సాధించిన ప్రతిసారీ చేసే ప్రత్యేకమైన సెలబ్రేషన్ వల్ల కూడా విపరీతమైన చర్చలకు దారితీశాడు. అతని సెలబ్రేషన్ పేరు ‘నోట్‌బుక్ సెలబ్రేషన్’.
వికెట్ పడగానే దిగ్వేష్ గాలిలో ఊహాత్మకంగా ఒక నోట్‌బుక్ తెరిచి, దానిలో రాస్తున్నట్టు చేస్తూ, ఆ తర్వాత ఆ ఆటగాడి పేరును దాటుతున్నట్లు చేతితో చూపిస్తాడు. అసలైన పోటీలో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. క్రికెట్ అభిమానులు దీనిపై రకరకాలుగా స్పందించగా, సోషల్ మీడియాలో ఈ సెలబ్రేషన్ వైరల్ అయింది.
ఇంతకీ ఇదేంటి.. ఇలా ఎందుకు చేస్తున్నాడు అన్న ప్రశ్నలకు తాజాగా లక్నో ఫ్రాంచైజీ తన అధికారిక అకౌంట్‌లో ఓ వీడియో షేర్ చేసింది. అందులో దిగ్వేష్ మాట్లాడుతూ ‘‘ప్రతి మ్యాచ్‌కు ముందు నేను నా నోట్‌బుక్ తీసుకుంటాను. దానికి లోపల నేను ఆడే బ్యాట్స్‌మెన్‌ల పేర్లు రాసుకుంటాను. వారిని అవుట్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతాను. ఎవ్వరైనా వికెట్ పడితే, వారి పేరును నేను నోట్‌బుక్‌లో దాటేసుకున్నట్టే సెలబ్రేట్ చేస్తాను. ఇది నాకు ఓ మోటివేషన్ లాంటి విషయం.. అని చెప్పాడు.

అయితే అదే సెలబ్రేషన్ ఇప్పుడు అతనికి బొక్కబోర్లా పడింది. ఇది ప్రత్యర్థులను రెచ్చగొట్టే చర్యగా మారిందని భావించిన బీసీసీఐ, అతనిపై పలు చర్యలు తీసుకుంది. మొదట పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్యను అవుట్ చేసినప్పుడు మొదటిసారిగా ఫైన్ వేసింది. తర్వాత ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధీర్‌ను అవుట్ చేసినప్పుడు కూడా అదే శైలి కొనసాగించడంతో, డీమెరిట్ పాయింట్లు వేసింది. కానీ అతను వెనక్కి తగ్గలేదు. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మను అవుట్ చేసిన తర్వాత కూడా అదే సెలబ్రేషన్ కొనసాగించడంతో, బీసీసీఐ అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది.
ఒక వైపు ఇది అభిమానుల చేత ప్రశంసలు అందుకున్నా, మరోవైపు క్రమశిక్షణ ఉల్లంఘనగా నిషేధానికి గురయ్యాడు. అంతా ముగిసిన తర్వాత కూడా క్రికెట్ లో ఓ యువ క్రికెటర్ తన ఆటతో పాటు ప్రత్యేకమైన శైలితో గుర్తింపు పొందడం విశేషం. అయితే ఆ స్టైల్ వల్ల నష్టపోవడం పెద్దగా అతడిని ఇబ్బంది పెట్టలేదు. మరి వచ్చే ఐపీఎల్ లో కూడా దిగ్వేష్ ఇదే కొనసాగిస్తాడో లేదో చూడాలి.