India’s squad for Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించింది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. ఈ మెగా టోర్నీకి జట్టులో చోటు దక్కదనుకున్న గిల్ అనూహ్యంగా టీమ్ లోకి వచ్చాడు. అంతేకాకుండా అతడిని వైస్ కెప్టెన్ గా కూడా చేశారు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. దాని ఆధారంగానే గిల్ ను జట్టులోకి తీసుకున్నారు. మరోసారి శ్రేయస్ అయ్యర్ కు సెలెక్టర్లు మెుండిచేయి చూపారు. టీమిండియా సీనియర్ బౌలర్ బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చాడు.
సెప్టెంబరు 09 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ టీ20 టోర్నీ కోసం మంగళవారం (ఆగస్టు 19) నాడు భారత జట్టును ఎంపిక చేశారు సెలెక్టర్లు. అయితే శుభ్ మన్ గిల్ కు చోటు దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గిల్ చివరిసారిగా టీ20 మ్యాచ్ ను 2024 జూలైలో శ్రీలంకతో ఆడాడు. ఆ సిరీస్ లో అతడే జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహారించాడు. అంతకముందు జింబాబ్వేలో జరిగిన టీ20 సిరీస్ కు కెప్టెన్ గా చేశాడు.
తెలుగోడికి చోటు..
ఇక మిగతా ఆటగాళ్లలో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లు తమ ఓపెనింగ్ స్థానాలను నిలబెట్టుకున్నారు. భీకర ఫామ్ లో ఉన్న హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ కూడా జట్టులో స్థానం సంపాదించాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో తిలక్ వరుసగా రెండు సెంచరీలు చేయడం విశేషం. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహారిస్తాడు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర పటేల్ తమ స్థానాలను నిలుపుకున్నారు.
Also Read: Asia Cup – ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఎవరిది పై చేయంటే?
ఆసియా కప్ కు భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, రింకూ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్స్: ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్


