టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ బాడీషేమింగ్ వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇప్పటికే ఈ విమర్శలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా బీసీసీఐ(BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు.
భారత జట్టు ఓ కీలకమైన ఐసీసీ టోర్నీ మధ్యలో ఉందని.. ఈ సమయంలో బాధ్యతాయుతమైన వ్యక్తి నుంచి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమన్నారు. ఈ వ్యాఖ్యలు ఆటగాడితో పాటు జట్టుపై ప్రతికూల ప్రభావం చూపించి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు.
కాగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఔటైన తర్వాత ఎక్స్ వేదికగా శమా మహమ్మద్ ఓ పోస్ట్ పెట్టారు. ‘‘రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు. అతడు బరువు తగ్గాల్సిన అవసరం ఉంది.’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను ఆమె సమర్థించుకున్నారు. రోహిత్‌ను బాడీషేమింగ్ చేయలేదని.. క్రీడాకారులకు ఫిట్‌నెస్ అవసరమనే రీతిలో మాట్లాడానని వెల్లడించారు. .