BCCI : టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మొత్తం ప్రక్షాళనకు సిద్దమైంది. అందులో భాగంగా మొదటగా సెలక్టర్లపై వేటు వేసింది. ప్రపంచకప్ కు జట్టును ఎంపిక చేసిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీనీ ఇంటికి పంపించింది. అంతేకాకుండా కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానించింది.
సీనియర్ పురుషుల క్రికెట్ జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలక్టర్లు కావాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటనను ఇచ్చింది. వీరికి ఉండాల్సిన అర్హతలను కూడా అందులో ప్రస్తావించింది. కనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని పేర్కొంది. ఐదు సంవత్సరాల క్రితమే క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికి ఉండాలని, అంతేకాకుండా ఐదేళ్ల పాటు ఏ క్రికెట్ కమిటీలోనూ సభ్యుడిగా లేని వాళ్లకు ప్రాధాన్యం ఇప్పనున్నట్లు వెల్లడించింది. ఆసక్తి ఉన్న వారు నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.