పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ(BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎప్పుడూ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టంచేశారు. ‘పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే బీసీసీఐ అదే చేస్తుంది. ఇప్పటికే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను భారత్ ఆడటం లేదు. భవిష్యత్తులో కూడా ఆడే ప్రసక్తే లేదని బలంగా చెబుతున్నాం. ఇన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ మండలిని గౌరవిస్తూ ఐసీసీ ఈవెంట్లలో తటస్థ వేదికలపై తలపడుతున్నాం. ఇప్పుడు ఉగ్రదాడి ఘనటతో ఐసీసీకి ఓ అవగాహన ఉందనుకుంటున్నా. కేంద్రం సూచనల మేరకు మేము పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడము’ అని శుక్లా వెల్లడించారు.
కాగా 2012-13 నుంచి ఇప్పటివరకు టీమ్‌ఇండియా పాక్ గడ్డపై అడుగుపెట్టలేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో తటస్థ వేదికలపైనే తలపడుతోంది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు దేశాలు తలపడిన సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉంటే బాగుంటుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో దైపాక్షిక సిరీస్‌లు ఆడమని బీసీసీఐ స్పష్టం చేసియడంతో ఇలాంటి ప్రతిపాదనలను తెరపడినట్లే.