BCCI : పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఏ రంగాన్ని వారు వదిలిపెట్టడం లేదు. ఒకప్పుడు క్రికెట్ అంటే పురుషుల క్రీడ అనే వారు. కానీ గత కొన్నేళ్లుగా క్రికెట్‌లో పలుమార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారి పురుషుల క్రికెట్‌లో మహిళా అంపైర్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
త్వరలో ప్రారంభం కానున్న దేశవాలీ రంజీ సీజన్ నుంచి మహిళా అంఫైర్లు మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్‌లోనూ మహిళా అంపైర్లు కనిపించనున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఇటీవలే మహిళా క్రికెటర్ల వేతనాన్ని పురుషులతో సమానంగా బీసీసీఐ పెంచిన సంగతి తెలిసిందే.
మనదేశంలో ప్రస్తుతం జనని, గాయత్రి, వృందారతి అనే ముగ్గురు మహిళా అంపైర్లు ఉన్నారు. త్వరలోనే మహిళా అంపైర్ల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి మాత్రం ఈ ముగ్గురే రంజీ సీజన్లలో అంపైరింగ్ విధులు నిర్వర్తించనున్నట్లు సమాచారం.
తమిళనాడుకు చెందిన జనని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులకుని అంపైర్‌గా కెరీర్‌ను ఎంచుకుంది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన అంపైర్ల ఇంటర్య్వూల్లో విజయం సాధించిన అనంతరం బీసీసీఐ నిర్వహించే మ్యాచ్‌లకు అంపైర్‌గా చేస్తున్నారు. ముంబైకి చెందిన వృందా రతి స్కోరర్‌గా పని చేసేశారు. అయితే.. కివీస్‌కు చెందిన కాతీ క్రాస్ స్పూర్తితో ఆమె అంపైర్‌గా రాణిస్తున్నారు. గాయత్రి వేణుగోపాలన్ కు తొలినాళ్లలో ఆటపై పెద్దగా అవగాహన లేదు. అయితే.. ఆ తరువాత ఇష్టంతో అంపైరింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.