Saturday, November 15, 2025
HomeఆటRCB: బెంగళూరు తొక్కిసలాట.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ

RCB: బెంగళూరు తొక్కిసలాట.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవం సందర్భంగా బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన ఆటగాళ్లు, సిబ్బంది సత్కారం కార్యక్రమంలో తమ ఫేవరెట్ ప్లేయర్లను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా తొక్కిసలాట(Bengaluru stampede) జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

దీంతో కర్ణాటక ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన సర్కార్.. దీనిపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే నగర కమిషనర్ దయానంద్ తో పాటు కొంతమంది పోలీసు అధికారులపై వేటు వేసింది. ఇక ఈ ఘటనపై సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఆర్సీబీ యాజమాన్యం, క‌ర్ణాటక‌ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ‌ర్లపై కేసు న‌మోదైంది.

ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును (Karnataka High Court) ఆశ్రయించింది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ప్రత్యేక పిటిషన్‌ వేసింది. తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆర్సీబీ, రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ లిమిటెడ్ (ఆర్‌సీఎస్‌ఎల్‌) తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు ఈవెంట్‌ ఆర్గనైజర్‌ అయిన డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా తమపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది.

మరోవైపు తమపై దాఖలైన కేసును సవాల్‌ చేస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఇప్పటికే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. కేఎస్‌సీఏ అధ్యక్షుడు రఘురామ్‌ భట్‌, కార్యదర్శి ఎ.శంకర్‌, కోశాధికారి ఈఎస్ జయరాం సంయుక్తంగా కర్ణాటక హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. తమపై నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. అలాగే విచారణకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad