ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025(IPL 2025) మార్చి 22న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్ మెరవునున్నారని సమాచారం. ఇక శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్, దిశా పటానీ తమ డ్యాన్సులతో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రముఖ గాయకులు అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే పంజాబ్ స్టార్ ర్యాపర్ కరణ్ ఔజ్లా ప్ర్యతేక షో చేయనున్నారు. మొత్తానికి కళ్లు చెదిరే రీతిలో ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు.
కాగా మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజుల పాటు జరుగుతాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. మార్చి 23న ఉప్పల్ వేదికగా హైదరాబాద్ – రాజస్థాన్ జట్ల మధ్య పోరు ఉండనుంది. మార్చి 24న విశాఖలో ఢిల్లీ – లక్నో, మార్చి 30న ఢిల్లీ- హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.
