Ravi Shastri| ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆసక్తిగా మారింది. భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరో మ్యాచ్ గెలిచి ఊపు మీదున్నాయి. తొలి టెస్టులో భారత్ అద్భుతమైన విజయం సాధించగా.. రెండో టెస్టులో కంగారూలు హోరెత్తించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది. డిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్‌లో మూడో టెస్టు ప్రారంభంకానుంది. గబ్బా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్(Gabba Test)లో విజయం సాధించడం కోసం ఇరు జట్లు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌కు మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక సూచన చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను తిరిగి ఓపెనర్‌గా బరిలోకి దించాలని సూచించాడు. సారథిగా జట్టును ముందుండి నడిపించడానికి అతను ఓపెనర్‌గా రావడమే బెటర్ అని తెలిపాడు. భారత్ మూడో టెస్టులో గెలవడం చాలా ముఖ్యమని.. ఎందుకంటే ఈ మ్యాచ్ ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.